CM Revanth Reddy: పాలమూరులో కాంగ్రెస్ ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి పేరును ప్రకటించారు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు మన్నె జీవన్ రెడ్డి. మహబూబ్‌నగర్ సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ నేత మన్నె శ్రీనివాస్ రెడ్డి సోదరుడి కొడుకే జీవన్ రెడ్డి. ప్రస్తుతం MSN ల్యాబ్స్ డైరెక్టర్‌గా మన్నె జీవన్ రెడ్డి ఉన్నారు. మార్చి 28న మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీకి కసిరెడ్డి రాజీనామా చేశారు. కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామాతో మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది.
ALSO READ: ఇల్లు కట్టుకునే వారికి రూ.5 లక్షలు.. మంత్రి కీలక ప్రకటన
ఓ దుర్మార్గుడు పాలించాడు..
సీఎం రేవంత్ సభలో మాట్లాడుతూ.. పాలమూరు ప్రజలకు చేతులెత్తి నమస్కారం చేస్తూ.. కార్యకర్తలే శాశ్వతం పదువులు కాదని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేసిందని పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యం కోసం మళ్లీ ప్రజలు పోరాటం చేశారని గుర్తు చేశారు. పదేళ్లపాటు రాష్ట్రాన్ని ఓ దుర్మార్గుడు పాలించాడని కేసీఆర్ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.
జెడ్పీటీసీగా..
పాలమూరు ప్రజలు 2006లో తనను జెడ్పీటీసీగా గెలిపించారని అన్నారు సీఎం రేవంత్. 2007లో ఎమ్మెల్సీగా గెలిపించిన ఘనత పాలమూరు ప్రజలదే అని పేర్కొన్నారు. పాలమూరు బిడ్డలు నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని అన్నారు. తాతల పేర్లు చెప్పుకుని నేను ఈ కుర్చీలో కుర్చోలేదని.. ఆఖరి శ్వాస వరకు ఈ జిల్లా అభివృద్ధి కోసం కష్టపడతా అని స్పష్టం చేశారు.
మోడీతోనూ పోరాడతా..
ప్రధాని రాష్ట్రానికి వస్తే ఆతిథ్యం ఇవ్వడం సంస్కారం అని అన్నారు సీఎం రేవంత్. తెలంగాణకు ఏం కావాలో ప్రధానిని అడిగినట్లు తెలిపారు. రాష్ట్రానికి న్యాయం చేయకపోతే ప్రధాని మోడీతోనూ పోరాడుతానని అన్నారు. బీఆర్ఎస్ అంటే బిల్లా రంగా సమితి అని ఎద్దేవా చేశారు. హరీష్ రావు, కేటీఆర్ ను చూస్తే నిజమే అనిపిస్తుందని చురకలు అంటించారు. 3,650 రోజులు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పాలించాయని తెలిపారు.