రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అంశంతో పాటు పలు అంశాలపై అధికారులతో చర్చించారు.గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితిపై ఆరా తీశారు. అలాగే భద్రచలం వద్ద వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వరదను ఎప్పటికప్పుడు అంచనా వేసి జాగ్రత్తలు పాటించాని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపైనా చర్చించారు. నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వెంటనే అక్కడ ఆగిపోయిన నీటిని తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు..
వర్షాలతో పాటు రాష్ట్రంలో పెరుగుతున్న ధాన్యం ఉత్పత్తిని రైతులకు లాభం చేకూర్చే దిశగా అనుబంధ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు తదితర అంశాలపైనా ఈ సమీక్షలో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ దామోదర్ రావు, రైతు బంధు సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, తదితర అధికారులు పాల్గొన్నారు.
ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి..
నైరుతి రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. గోదావరి నీటిమట్టం 43 అడుగులు దాటడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. అలాగే ముంపు ప్రాంతాలకు చెందిన వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉండటంతో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది.
నాలుగు జిల్లాలకు హెచ్చరికలు..
మరోవైపు రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సహాయక బృందాలను అప్రమత్తం చేసింది.ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, హనమకొండ, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.