సీఎం కేసీఆర్: (CM KCR)
ప్రస్తుత సీఎం, గులాబీ బాస్ కేసీఆర్.. 1983లో తొలిసారి టీడీపీ అభ్యర్థిగా సిద్దిపేట నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో అనంతుల మదన్ మోహన్ చేతిలో కేవలం 877 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇక అప్పటి నుంచి ఆయన తిరిగి చూడకుండా సిద్దిపేటను కంచుకోటగా మార్చుకున్నారు. అక్కడి నుంచే 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ నుంచి వరుసగా జయకేతనం ఎగురవేశారు. టీఆర్ఎస్ స్థాపించిన తర్వాత..ఆ పార్టీ అభ్యర్థిగా 2001 ఉప ఎన్నికలోనూ విజయం సాధించారు. 2004లో సిద్దిపేట ఎమ్మెల్యేగా, కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు కేసీఆర్. రెండు స్థానాల నుంచి గెలిచి చరిత్ర సృష్టించారు. అనంతరం సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా కొనసాగారు. ఆ టర్మ్ లోనే కేంద్రమంత్రిగానూ ఆయన పని చేశారు. 2006, 2008 ఉప ఎన్నికల్లో కరీంనగర్ నుంచి గెలిచి ఎంపీగా హ్యాట్రిక్ సాధించారు. 2009లో మహబూబ్‌నగర్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014, 2018 ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి రెండు సార్లు గెలిచి.. సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి: (Uttam Kumar Reddy)
ఈజాబితాలో రెండో స్థానం కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి దక్కుతుంది. కోదాడ నుంచి 1994లో తొలిసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమిని రుచి చూశారు. టీడీపీ అభ్యర్థి వేనేపల్లి చందర్‌రావు చేతిలో ఓడిపోయారు. 1999, 2004 ఎన్నికల్లో ఆయనపైనే ఉత్తమ్ వరుస విజయాలు సాధించారు. తర్వాత ఆయన హుజూర్‌నగర్‌కు మారిపోయారు. 2009లో ప్రస్తుత మంత్రి జగదీష్‌రెడ్డిపైనే గెలుపొందారు. 2014, 2018లో అదే స్థానం నుంచి వరుసగా గెలిచారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా విజయభేరీ మోగించారు. ఉమ్మడి రాష్ట్రంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగానూ సేవలు అందించారు. 2015 నుంచి 2021 వరకు ఆరేళ్లపాటు పీసీసీ చీఫ్‌గా పనిచేశారు.
కిషన్ రెడ్డి కూడా.. (Kishan Reddy)
కార్యకర్త స్థాయి నుంచి బీజేపీలో ప్రస్థానం ప్రారంభించిన కిషన్‌రెడ్డి అనేక పదవులను అందుకున్నారు. ఎమ్మెల్యే, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఎంపీ, కేంద్రమంత్రి వరకు అంచెలంచెలుగా ఎదిగారు. 1999లో కార్వాన్ నుంచి పోటీ చేసి మజ్లిస్ అభ్యర్థి సయ్యద్ సజ్జర్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత హిమాయత్ నగర్, అంబర్‌పేట్ స్థానాల నుంచి వరుసగా విజయాలు సాధించారు కిషన్‌రెడ్డి. 2018లో స్వల్ప ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ చేతిలో ఓటమి పాలైయ్యారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఎంపీగా గెలుపొందిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నారు.
కొప్పుల ఈశ్వర్: (Koppula Eshwar)
ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్ సైతం ఓటమితోనే రాజకీయ జీవితం మొదలు పెట్టారు. 1994 ఎన్నికల్లో మేడారం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి మాలెం మల్లేశం చేతిలో ఓడిపోయారు. అనంతరం బీఆర్ఎస్‌లో చేరారు. 2004లో మేడారం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2008 ఉప ఎన్నికల్లో విజయ ఢంకా మోగించారు. నియోజకవర్గాల పునర్విభజనతో 2009 నుంచి ధర్మపురి నుంచి పోటీ చేస్తున్నారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా జయకేతనం ఎగురవేశారు. 2010 ఉప ఎన్నికల్లోనూ ఆయన గెలుపొందారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చీఫ్ విప్‌గా, మంత్రిగా పనిచేశారు.
జగదీష్ రెడ్డి: (Jagadeesh Reddy)
బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్న జగదీష్‌రెడ్డి 2009లో తొలిసారి హుజూర్ నగర్ నుంచి బరిలో దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ చేతిలో ఓటమి రుచి చూశారు. అనంతరం సూర్యాపేటకు మకాం మార్చారు. 2014, 2018 ఎన్నికల్లో అక్కడి నుంచి వరుసగా గెలవడంతో పాటు కాంగ్రెస్ కంచుకోట అయిన నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ ఎమ్మెల్యేలు దర్కించుకోవడంలో కీలక పాత్ర పోషించారు. రెండుసార్లు మంత్రిగా సేవలందించారు. ఈసారి కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు జగదీష్ రెడ్డి.