Jagan Comments on Chandrababu: చంద్రబాబు పాలన చూస్తే కుప్పంలో కూడా ఆయన మావాడే అని చెప్పుకునే పరిస్థితి లేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM Jagan) అన్నారు. కుప్పంలో ఒక్క పేదవాడికి కూడా చంద్రబాబు ఇంటి స్థలం ఇవ్వలేదని ఆరోపించారు. కానీ, మీ బిడ్డ జగన్ ప్రభుత్వం కుప్పంలో కొన్ని వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి.. ఇళ్ల నిర్మాణాలు చేపట్టిందన్నారు. ఈ రోజు ఎమ్మిగనూరులో జగనన్న చేదోడు పథకం (Jagananna Chedodu Scheme) నిధుల విడుదల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. గత పాలనకు ఇప్పటి పాలనకు తేడా గమనించాలని ఓటర్లను కోరారు. ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు వచ్చి చేరుతున్నాయన్నారు.
ఇది కూడా చదవండి: AP Cheddi Gang: కుప్పంను బెంబేలెత్తిస్తున్న చెడ్డీగ్యాంగ్.. హడలిపోతున్న నగర వాసులు
అప్పట్లో గజదొంగల ముఠా రాష్ట్రాన్ని దోచేసిందని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ధ్వజమెత్తారు సీఎం. అప్పుడు అభివృద్ధి ఎందుకు జరగలేదో ప్రజలు ఆలోచించాలని కోరారు. అప్పుడు, ఇప్పుడు అదే రాష్ట్రం, అదే బడ్జెట్ అని అన్నారు. కానీ.. మారింది కేవలం సీఎం మాత్రమేనన్నారు. చంద్రబాబు పాలనలో సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎత్తేశారన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు తీసుకువచ్చిన మేనిఫెస్టోను.. ఎన్నికల తర్వాత చెత్తబుట్టలో పడేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. కానీ, మన ప్రభుత్వం మేనిఫెస్టోలో 99 శాతం హామీలను అమలు చేసిందన్నారు.
చంద్రబాబు రుణమాఫీ కూడా చేయలేదన్నారు. అమరావతి రాజధాని భూములతో మొదలుపెడితే.. స్కిల్ స్కాం వరకు గత ప్రభుత్వంలో అన్నీ కుంభకోణాలు, అవినీతే అని అన్నారు. గతంలో ఏ పౌర సేవ కావాలన్నా జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదన్నారు జగన్. అప్పట్లో ఆరోగ్యశ్రీని వదిలించుకోవాలని బాబు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. వైసీపీ పాలనలో 18 మెడికల్ కాలేజీలు నిర్మాణం అవుతున్నాయన్నారు. మన పాలనలో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించామన్నారు. పేదవాడు ఒకవైపు.. పెత్తందారులు ఒకవైపు ఉన్నారని.. ప్రస్తుతం వీరి మధ్య పోరాటం జరుగుతోందన్నారు. ఈ యుద్ధంలో తోడేళ్లంతా ఏకమవుతారన్నారు.