CM Chandrababu: సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు షాకిచ్చారు. రెండు రాష్ట్రాల సమస్యలపై ఏపీ, తెలంగాణ ఎంపీలు కేంద్రం వద్దకు వెళ్తే బాగుంటుందని సీఎం రేవంత్ ప్రతిపాదించగా.. దానికి సీఎం చంద్రబాబు నిరాకరించారు. రెండు రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నందున రాజకీయంగా అది సాధ్యం కాదని చంద్రబాబు సీఎం రేవంత్‌కు బదులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాల స్థాయుల్లో కలిసి ప్రయత్నం చేస్తే సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకోవచ్చని సూచించారు. అటు 2 రాష్ట్రాల అధికారుల కమిటీల మధ్య వీలైనన్ని సమావేశాలు తరచూ జరగాలని, సమస్యలు పరిష్కరించాలని ఇరువురూ సీఎంలు నిర్ణయించారు.
సబ్ కమిటీ ఏర్పాటు చేస్తాం..
పదేళ్లుగా చాలా అంశాలు పరిష్కరానికి నోచుకోలేదని, వాటిని పరిష్కరించేందుకు ఉన్నతస్థాయి అధికారులతో కమీటీలు వేయాలని నిర్ణయించినట్లు భట్టి తెలిపారు. ఇక డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి రెండు తెలుగు రాష్ట్రాలు సంయుక్తంగా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించామని భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రధానంగా రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం షెడ్యూలు 9, 10లో పేర్కొన్న సంస్థల ఆస్తుల పంపకాలపై చర్చ జరిగింది. అలాగే విభజన చట్టంలో పేర్కొనని సంస్థల ఆస్తుల పంపకాలు, ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశాలు, పెండింగ్ విద్యుత్తు బిల్లులు, విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు నిర్మించిన అప్పుల పంపకాలు, ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చుకు చెల్లింపులు, హైదరాబాద్‌లో ఉన్న మూడు భవనాలు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించే అంశంతోపాటు లేబర్ సెస్ పంపకాలు ఉద్యోగుల విభజన అంశాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం.