/rtv/media/media_files/2025/09/14/radha-2025-09-14-17-14-08.jpg)
హీరో వెంకటేష్, బి. గోపాల్ కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా బొబ్బిలి రాజా. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో డి. సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. 1990 సెప్టెంబరు 14న రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. వెంకటేష్ చిత్రాలలో 3 సెంటర్లలో 175 రోజులు ప్రదర్శించబడిన మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించగా సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్ని పాటలు రాశారు. ఈ సినిమా రిలీజై 35 ఏళ్లు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నటి దివ్యభారతికి బొబ్బిలి రాజా తొలి తెలుగు సినిమా. ఈ సినిమా ఆమెకు తెలుగులో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆమె తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఎదిగింది. అయితే ఈ సినిమాకు ముందుగా హీరోయిన్ గా రాధను అనుకున్నారు. కానీ ఆమె డేట్స్ కుదరక ఈ సినిమాను వదులుకున్నారు. దీంతో దివ్యభారతికి అవకాశం లభించింది. గోపాలకృష్ణ కొత్త అమ్మాయిని తీసుకుందామని ప్రతిపాదించడంతో దివ్యభారతిని ఎంపిక చేశారు.
ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే పరుచూరి బ్రదర్స్ అందించారు. తొలుత పరుచూరి గోపాలకృష్ణ ఒక రాజకీయ నేపథ్య కథను చెప్పగా, వెంకటేశ్వరరావు దానిని అంగీకరించలేదు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఈ అటవీ నేపథ్యం ఉన్న కథను రూపొందించారు. బొబ్బిలి రాజా' సినిమా వెంకటేష్ కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించి, మూడు కేంద్రాల్లో 175 రోజుల పాటు ఆడి వెంకటేష్ మొదటి సిల్వర్ జూబ్లీ చిత్రంగా రికార్డు సృష్టించింది.
రాజేశ్వరి దేవి పాత్రకు మొదటగా
సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చాలా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేశాయి. రైలులో జరిగే పోరాట సన్నివేశాలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఈ సినిమాలో వాణిశ్రీ పోషించిన రాజేశ్వరి దేవి పాత్రకు మొదటగా నటి శారదను అనుకున్నారు. కానీ అప్పటికే శారద అలాంటి పాత్రలు చాలా చేసి ఉండటంతో సురేశ్ బాబు సూచన మేరకు కొత్తదనం కోసం వాణిశ్రీని తీసుకున్నారు.
ఈ చిత్రంలో కనిపించే అటవీ ప్రాంతమంతా తమిళనాడులోని పొల్లాచ్చి పరిసర ప్రాంతాలకు సంబంధించింది. అక్కడ 40 రోజులకు పైగా చిత్రీకరణ జరిగింది. తొలిసారిగా కెమెరామెన్ బాధ్యతలు చేపట్టిన కె. రవీంద్రబాబు జంతువులను చిత్రీకరించడానికి బాగా కష్టపడ్డాడు. పతాక సన్నివేశాల్లో కదిలే రైల్లో పోరాటాలు చిత్రీకరించారు. ఒక్కో బోగీల్లో కొన్ని జంతువులను ఉంచి చిత్రీకరించారు.