Shriya Saran: అప్పుడు పిన్నిగా.. ఇప్పుడు తల్లిగా.. 'మిరాయ్' నుంచి శ్రేయ ఫస్ట్ లుక్!

యంగ్ హీరో తేజసజ్జా నటించిన లేటెస్ట్ మూవీ  'మిరాయ్' లో శ్రేయా తల్లి పాత్రలో కనిపించబోతుంది.  తేజ సజ్జా తల్లిగా అంబిక పాత్రలో నటించింది. ఈ మేరకు తాజాగా మూవీ నుంచి శ్రేయా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.

New Update

Shriya Saran: మీకు పవన్ కళ్యాణ్ 'బాలు' సినిమా గుర్తుందా? ఇందులో శ్రేయా- పవన్ కళ్యాణ్ తో పాటు వారితో కనిపించే చైల్డ్ ఆర్టిస్ట్స్  చెర్రీ (తేజ సజ్జా), లిల్లీ (కావ్య కళ్యాణ్ రామ్) పాత్రలు కూడా గుర్తుండే ఉంటాయి.  పవన్ కళ్యాణ్ అన్న కొడుకుగా తేజ సజ్జా, శ్రేయ మేనకోడలిగా కావ్య నటించారు. సినిమాలో ఈ నలుగురి  మధ్య  వచ్చే  సన్నివేశాలు ప్రేక్షకులను తెగ   ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఈ సన్నివేశాలకు సంబంధించిన క్లిప్స్ వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే అప్పుడు పవన్ గర్ల్ ఫ్రెండ్ గా తేజ సజ్జకు పిన్ని వరుసలో కనిపించిన శ్రేయా.. ఇప్పుడు తల్లిగా కనిపించబోతుంది. 

తల్లిగా శ్రేయా

 తేజ సజ్జా హీరోగా నటించిన లేటెస్ట్ మైథలాజికల్ థ్రిల్లర్  'మిరాయ్'  లో శ్రేయా తేజకు తల్లిగా  కనిపించబోతుంది. ఈ మేరకు తాజాగా మూవీ నుంచి శ్రేయా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ''ప్రతి సూపర్ హీరో  ప్రయాణం వెనుక ఒక శక్తివంతమైన తల్లి ఉంటుంది''  అంటూ ఆమె  పాత్రను ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో ఇందులో శ్రేయా పాత్ర పేరు అంబిక! పోస్టర్ లో శ్రేయా లుక్ చూస్తుంటే.. కొన్ని అతీతమైన శక్తులు కలిగిన మహిళగా శ్రేయా పాత్ర పవర్ ఫుల్ గా ఉండబోతుందని తెలుస్తోంది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మళయాళంతో పాటు స్పానిష్, జాపనీస్, కొరియా వంటి ఇతర అంతర్జాతీయ భాషల్లో కూడా అందుబటులోకి రానుంది. డైరెక్టర్  కార్తిక్ ఘట్టమనేని గతంలో సూర్య వర్సెస్ సూర్య, ఈగల్, చౌర్య పాటం వంటి సినిమాలు చేశారు. 

సినిమా విడుదల దగ్గరపడుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ షురూ చేశారు. ఇప్పటికే ట్రైలర్, టీజర్, సాంగ్స్ విడుదల చేయగా సినిమాకు సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. ఇందులో తేజ సజ్జ ప్రపంచాన్ని  ఒక చీకటి శక్తి నుంచి కాపాడే యోధుడిగా కనిపించబోతున్నాడు. డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని ఈ చిత్రాన్ని ఒక పురాతన ఇతిహాసం ఆధారంగా రూపొందించారు. 

సినిమా కథేంటి 

పురాణాల ప్రకారం.. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు తన జ్ఞానాన్ని తొమ్మిది పవిత్ర గ్రంథాలుగా విభజించి, తొమ్మిది మంది  రహస్య యోధులకు అప్పగిస్తాడట. ఆ గ్రంథాలను వారు తరతరాలుగా కాపాడుతూ వస్తుంటారు. ఈ గ్రంథాలను పొందడానికి ఒక దుష్టశక్తి ( మంచు మనోజ్) ప్రయత్నిస్తుంటాడు. అప్పుడు ఈ చీకటి శక్తి నుంచి దేశాన్ని కాపాడడానికి తేజ సజ్జ 'మిరాయ్'  అనే యోధుడిగా అవతరిస్తాడు. తేజ సజ్జ ఆ చీకటి శక్తి నుంచి గ్రంథాలను ఎలా కాపాడాడు? ఈ క్రమంలో ఏం జరిగింది? అనేది సినిమా కథగా ఉండబోతుందని తెలుస్తోంది.

ఇందులో తేజ సజ్జ హీరోగా నటించగా.. మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నారు. రితికా నాయక్, శ్రియా శరణ్, జగపతి బాబు, జయరామ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ బడ్జెట్ పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంలో వీఎఫెక్స్, యాక్షన్ సన్నివేశాలు అత్యన్నత స్థాయిలో, హాలీవుడ్ ప్రమాణాలకు దీటుగా ఉంటాయని చిత్రబృందం తెలిపింది.  గతేడాది 'హనుమాన్'  సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న తేజ.. ఇప్పుడు మరో సూపర్ హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 

Also Read: SSMB29 Rajamouli: కెన్యా మంత్రిని కలిసిన రాజమౌళి.. 120 దేశాల్లో! SSMB29 కోసం భారీ ప్లానింగ్

Advertisment
తాజా కథనాలు