/rtv/media/media_files/2025/11/19/nampally-court-grants-permission-for-the-custody-of-ibomma-ravi-2025-11-19-16-46-57.jpg)
Nampally Court grants permission for the custody of iBomma Ravi
ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమండి రవిని సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి, ప్రస్తుతం నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ఐదు రోజుల పోలీసు కస్టడీలో విచారిస్తున్నారు. దర్యాప్తులో అతని వ్యక్తిగత జీవితం, ఆర్థిక లావాదేవీల గురించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రవి పైరసీ మార్గాన్ని ఎంచుకోవడానికి అతని వ్యక్తిగత జీవితంలో ఎదురైన చేదు అనుభవాలే ప్రధాన కారణంగా పోలీసులు గుర్తించారు. అమీర్‌పేట్‌లోని కోచింగ్ సెంటర్‌లో పరిచయమైన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ పాప కూడా ఉంది.
ఏడాది పాటు సంతోషంగా ఉన్నా, ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. విదేశాల్లో ఉన్న అక్క, బావ కోట్లు సంపాదిస్తుంటే, తనకు డబ్బు సంపాదించడం చేతకాదని రవి భార్య, అత్తతో కలిసి ఘోరంగా ఎగతాళి చేసేవారని దర్యాప్తులో తేలింది. ఈ గొడవల కారణంగా వారు విడాకులు తీసుకున్నారు. భార్య కూతురిని తీసుకెళ్లడంతో, రవి నాలుగేళ్లుగా కుటుంబానికి దూరంగా ఒంటరి జీవితం గడుపుతున్నాడు. కనీసం కూతురిని చూసే అవకాశం కూడా అతనికి లేకుండా పోయింది. ఎలాగైనా డబ్బు సంపాదించాలనే కసితోనే పైరసీ, గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులతో వ్యాపార లావాదేవీలు నడుపుతూ, విదేశాలకు తిరగడం మొదలుపెట్టాడు.
నవంబర్ 14న కూకట్‌పల్లిలోని అపార్ట్‌మెంట్‌లో రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో అతని జీవనశైలి వింతగా ఉంది. రవి ఇల్లు దుమ్ము, ధూళితో చిందరవందరగా, అపరిశుభ్రంగా ఉంది. రెండు నెలలకోసారి విదేశాలకు వెళ్లినా, తిరిగి ఇంటికి వచ్చేవాడు. తన గుట్టు బయటపడుతుందనే భయంతో రవి మనుషులను నమ్మడం మానేశాడు. పనివాళ్లను కూడా పెట్టుకోలేదు. తన నివాసం బయటి వ్యక్తుల నుంచి సురక్షితంగా ఉండటానికి, ఇంటి స్మార్ట్ డోర్‌లాక్‌కు సీక్రెట్ కెమెరా అమర్చాడు. ఎవరైనా వస్తే కెమెరా ద్వారా చూసుకున్నాకే తలుపులు తీసేవాడు. పోలీసులు తనిఖీ సమయంలో ఈ కెమెరాను గుర్తించారు.
రంగంలోకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
పైరసీ ద్వారా వచ్చిన డబ్బుకు సంబంధించి మనీలాండరింగ్ జరిగిందని అనుమానిస్తూ, రవి బ్యాంకు ఖాతాల నుంచి రూ. 3.5 కోట్లకు పైగా డబ్బును స్తంభింపజేసింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా రంగంలోకి దిగింది. కాగా రవి అరెస్ట్ అనంతరం, పోలీసులు ఐ-బొమ్మతో పాటుగా దాని అనుబంధ వెబ్‌సైట్‌లను శాశ్వతంగా బ్లాక్ చేయించారు.
Follow Us