/rtv/media/media_files/2026/01/26/raviteja-2026-01-26-12-43-22.jpg)
మాస్ మహారాజా రవితేజ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. దర్శకుడు శివ నిర్వాణతో ఆయన చేస్తున్న మొదటి సినిమాకు సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ సినిమాకు ఇరుముడి అనే ఆసక్తికరమైన పేరును ఖరారు చేశారు. పేరుకు తగ్గట్టుగానే పోస్టర్‌లో రవితేజ ఎప్పుడూ చూడని విధంగా పూర్తి ఆధ్యాత్మిక అవతారంలో కనిపిస్తున్నారు. అయ్యప్ప స్వామి మాల వేసుకుని, నల్లటి దుస్తుల్లో, నుదుట విభూతి, మెడలో రుద్రాక్షలతో రవితేజ కనిపిస్తున్న తీరు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భుజంపై పవిత్రమైన ఇరుముడి సంచితో ఉన్న రవితేజ లుక్ ఈ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
బలమైన ఎమోషన్ తో
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కేవలం భక్తి మాత్రమే కాకుండా, ఒక బలమైన ఎమోషన్ కూడా కనిపిస్తోంది. రవితేజ చంకలో ఒక చిన్న పాపను ఎత్తుకుని నవ్వుతూ కనిపిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే సినిమాలో తండ్రి-కూతుళ్ల మధ్య ఉండే అనుబంధం కథలో చాలా కీలకమని అర్థమవుతోంది. శివ నిర్వాణ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్ కు తోడుగా, రవితేజ మార్క్ మాస్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది. రవితేజ తన కెరీర్‌లో చేస్తున్న ఒక డిఫరెంట్ అటెంప్ట్ కావడంతో, ఈ పాత్రలో ఆయన ఎలా మెప్పిస్తారోనని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. రవితేజ కూతురి పాత్రలో బేబీ నక్షత్ర కనిపించనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తోంది. మొత్తానికి రవితేజ తన 57వ పుట్టినరోజున 'ఇరుముడి'తో ఒక పవర్ ఫుల్ బాక్సాఫీస్ హిట్‌ను అందుకునేలా కనిపిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
Follow Us