'దేవర' మూవీ టీమ్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో దేవర స్పెషల్ షోలతో పాటూ టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తాజాగా జీవో విడుదల చేసింది. జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ 'దేవర' సెప్టెంబర్ 27 న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం నిర్మాతలు సుమారు 200 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు చేశారు.
ఈ నేపథ్యంలో సినిమా టికెట్ ధరలతో పాటు స్పెషల్ షోల విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చిత్ర యూనిట్ కొద్దిరోజుల క్రితం సంప్రదించింది. దీంతో తాజాగా ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి టికెట్ ధరకు అధనంగా ఎంతమేరకు పెంచుకునే వెసులుబాటు ఉందో చెబుతూ ఒక జీవోను రిలీజ్ చేసింది.
టికెట్ రేట్లు ఎలా ఉన్నాయంటే..
'దేవర' విడుదల రోజు అర్ధరాత్రి 12 గంటల షోతో పాటు ఆరు ఆటలకు ఏపీ అనుమతిచ్చింది. ఆ తర్వాత రోజు 5 షోలు ప్రదర్శించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఇలా 9రోజుల వరకు అదనపు షోలు ఉండనున్నాయి. ఇదే క్రమంలో దేవర టికెట్ల ధరలను సైతం పెంచుకునే అవకాశం ఇచ్చింది. మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్లపై రూ.135 వరకూ, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్ పై రూ.110, లోయర్ క్లాస్ ఒక్కో టికెటైపై రూ.60 వరకూ పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది.
జీఎస్టీతో కలుపుకొనే ఈ ధరలు ఉండనున్నాయి. అంటే ఈ లెక్కన సింగిల్ స్క్రీన్‌లో దేవర టికెట్ ధర రూ. 225 ఉంటే మల్టీప్లెక్స్‌లలో మాత్రం రూ.320 ఉండనుంది. ఈ పెరిగిన ధరలు సెప్టెంబర్ 27 నుంచి 14 రోజుల పాటు ఉండనున్నాయి. కాగా తమ సినిమాకు స్పెషల్ షోలు, టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై హీరో జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.