Ustaad Bhagat Singh: జెట్ స్పీడ్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. భారీ ఓటీటీ డీల్ ఫిక్స్!

పవన్ కళ్యాణ్- హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధమవుతోంది.

New Update
Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై భారీ అంచనాలు ఉన్నాయి. ‘దే కాల్ హిమ్ ఓజీ’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న తర్వాత పవన్ మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నారు. రాజకీయాల్లో కొనసాగుతూనే అభిమానులను అలరించే సినిమాలు చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలోనే ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ముఖ్యమైన ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్.

ఈ చిత్రానికి పవన్ వీరాభిమాని అయిన హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత ఈ ఇద్దరి కలయిక కావడంతో సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పవన్ వింటేజ్ లుక్ వీడియోలు, డాన్స్ స్టెప్స్‌కు అభిమానుల నుంచి మంచి రెస్పాస్ వచ్చింది. పవన్‌ను అభిమానులు కోరుకునే విధంగా చూపించేందుకు హరీశ్ శంకర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Ustaad Bhagat Singh OTT Deal

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ అధికారికంగా బయటకు వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ డీల్ భారీ మొత్తానికి కుదిరినట్లు సమాచారం. అయితే ఖచ్చితమైన మొత్తం ఇంకా ప్రకటించలేదు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ ఓటీటీ రైట్స్ విలువ 80 నుంచి 120 కోట్ల రూపాయల మధ్య ఉండొచ్చని టాక్.

ఇక థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా కూడా ఈ సినిమాకు మంచి ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తయ్యేలోపే డిస్ట్రిబ్యూటర్లు అడ్వాన్స్‌లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట. అయితే నిర్మాతలు మాత్రం తొందరపడకుండా, టీజర్, ట్రైలర్ విడుదలైన తర్వాత డీల్స్ ఫైనల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని ఫిలింనగర్‌లో మాట వినిపిస్తోంది.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మొదటి పాట ‘దేఖ్ లేంగే సాలా’ అభిమానులను బాగా ఆకట్టుకుంది.

సినిమాకు స్క్రీన్ ప్లే దశరథ్, రమేష్ రెడ్డి అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీని అయాంక బోస్, ఎడిటింగ్‌ను కార్తీక్ శ్రీనివాస్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ తన షూటింగ్‌లో ఎక్కువ భాగం పూర్తి చేసినట్లు సమాచారం. కొంత ప్యాచ్ వర్క్ మాత్రం మిగిలి ఉందని టాక్.

సమ్మర్ కానుకగా 2026 ఏప్రిల్‌లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓజీతో పవన్ తన మార్కెట్‌ను మరోసారి నిరూపించడంతో, ఇప్పుడు అందరి చూపు ఉస్తాద్ భగత్ సింగ్‌పైనే ఉంది. అభిమానుల అంచనాలకు తగ్గ సినిమా అవుతుందనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో కనిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు