రాజమండ్రి సెంట్రల్ జైలులో రెండో రోజు కొనసాగుతున్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడి విచారణకు సీఐడీ అధికారులు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఒంటి గంట నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు ఇంటి నుంచి వచ్చిన భోజనాన్నే చేయనున్నారు. భోజనం అనంతరం తిరిగి రెండు గంటలకు విచారణ ప్రారంభంకానుంది. అనంతరం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చంద్రబాబు విచారణ కొనసాగనుంది. విచారణ ముగిసన తర్వాత చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. విచారణకు మరో 3 గంటల సమయం మాత్రమే సీఐడీకి మిగిలి ఉంది.
ఇది కూడా చదవండి: Nara Lokesh Yuvagalam: యువగళం యాత్రపై నారా లోకేష్ సంచలన నిర్ణయం.. ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్
ఈ నేపథ్యంలో ఈ మూడు గంటలే కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మిగిలిన సమయంలో చంద్రబాబు నుంచి సాధ్యమైనంత సమాచారాన్ని రాబట్టడమే లక్ష్యంగా సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఉదయం నుంచి అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు ఇచ్చిన సమాధానాల ఆధారంగా అవసరం అయితే.. వ్యూహాన్ని మార్చుకోనుంది సీఐడీ. ఉదయం చంద్రబాబు సమాధానాల ఆధారంగా కొత్త ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
చంద్రబాబు నుంచి సంతృప్తికరంగా సమాధానాలు రాకపోతే కస్టడీ మరికొన్ని రోజులు పొడిగించాలని సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. కిలారి రాజేష్ పాత్రతో పాటు పీఎస్ శ్రీనివాస్ ద్వారా రూ.118 కోట్లను మళ్లించారా? అన్న కోణంలో లంచ్ బ్రేక్ వరకు విచారణ సాగినట్లు తెలుస్తోంది. మరో వైపు చంద్రబాబు కేసు విషయమై నారా లోకేష్ ఢిల్లీలో న్యాయవాదులతో మంతనాలు జరుపుతున్నారు.