AP Elections: ఏపీలో సాధారణ ఎన్నికల నిర్వహణకు మార్చిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) తెలిపారు. ఇప్పటికే ఆగస్టులో ప్రారంభించిన ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే కొత్త ఓటర్ల నమోదు పూర్తి చేసింది ఈసీ. తాజాగా ముసాయిదా ఓటర్ల జాబితాను కూడా వెల్లడించింది. వాటిలో అభ్యంతరాలను డిసెంబర్ వరకూ స్వీకరించి అనంతరం వాటిని పరిష్కరించనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత జనవరి మొదటివారంలోనే తుది ఓటర్ల జాబితాను ప్రచురించనుంది. దీని ఆధారంగా వచ్చే ఏడాదిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల (AP Elections) నిర్వహణకు రెడీ అవుతోంది. ఇదే క్రమంలో వచ్చే ఏడాది మార్చిలో ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు ఏపీ ఎన్నికల ముఖ్య అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.
ఈ లెక్కన మార్చిలో (March) ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్ లోనే ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా షెడ్యూల్ ప్రకటించిన నెల రోజుల్లోనే ఎన్నికలు నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం. ఇదే క్రమంలో ఏపీలోనూ షెడ్యూల్ ప్రకటించిన నెల రోజుల వ్యవధిలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈసీ ఏర్పాట్లను చేస్తోంది.