హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ నేతలు చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ పోరాటాన్ని తెలంగాణ ప్రజలు స్పూర్తిగా తీసుకుంటున్నారన్నారు. నిజాం నిరంకుశ పాలనపై చాకలి ఐలమ్మ చేసిన పోరాటం మరువలేనిదన్నారు. ఒకవైపు స్వాతంత్య్రం కోసం పోరాటం జరుగుతుంటే.. మరోవైపు నిజాం నిరంకుశ వ్యతిరేక పాలన సాగిందన్నారు. అలాంటి సమయంలో వరంగల్ పాలకుర్తి ప్రాంతాల్లో నిజాం దొరల పెత్తందారుల దోపిడీపై చాకలి ఐలమ్మ చేసిన పోరాటం గొప్పదన్నారు.
కొడవళ్లు, గుణపాళ్లను ఆయుధాలుగా చేసుకొని యావత్ తెలంగాణ సమాజాన్ని చైతన్య పరుస్తూ నిజాం గడీలను కూల్చేందుకు చాకలి ఐలమ్మ పోరాటం కొనసాగిందన్నారు. కులవృత్తులపై ఆధారపడి పీడింపబడ్డ సమాజాన్ని మేల్కొల్పి ఉద్యమ స్పూర్తిని నింపిన ఘనత చాకలి ఐలమ్మది అని లక్ష్మణ్ అన్నారు. నిజాం రాజులను ఎదురించిన చాకలి ఐలమ్మ చరిత్ర పాఠ్య పుస్తకాల్లో లేకపోవడం దురదృష్టకరమన్నారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, కొమరం భీమ్ వంటి మహానుభావులు పుట్టిన నేల తెలంగాణ అన్నారు.
మరోవైపు తెలంగాణ చరిత్రను ప్రపంచానికి తెలిసే విధంగా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించిందని ఆయన గుర్తు చేశారు. దీంతోపాటు విశ్వకర్మ పేరు మీద కులవృత్తులపై ఆధారపడి జీవించే వారిని అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. చాకలి ఐలమ్మను స్పూర్తిగా తీసుకొని మోడీ ప్రభుత్వం విశ్వకర్మ పథకం కింద 13 వేల కోట్ల రూపాయలను కేటాయించిదని, ఈ డబ్బులు కులవృత్తుల వారికి ఆర్థిక సహాయం అందించేందుకు ఉపయోగిస్తున్నారన్నారు.