Visakha Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర మంత్రి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుందని.. జీవనోపాధి కోసం అనేక కుటుంబాలు ఈ ప్లాంట్ పై ఆధారపడ్డాయని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించడం తమ బాధ్యత అని చెప్పారు. ప్లాంట్ మూతపడుతుందని ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. ప్రధాని మోదీ సహాయంతో ఈ ప్లాంట్ మళ్లీ 100 శాతం సామర్థ్యంతో పనిచేసేలా చేస్తామన్నారు.
స్టీల్ ప్లాంట్‌ను కేంద్రమంత్రి కుమారస్వామి ఈరోజు పరిశీలించారు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో బ్యాంకర్లు, RINL,SAIL,NMDC అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ ఆర్థిక నష్టాలు, ముడి ఖనిజ కొరత పరిష్కారంపై రివ్యూ చేశారు. ఆ తర్వాత కార్మిక సంఘాలు, నిర్వాసిత గ్రామాల ముఖ్యులతో సమావేశం అయ్యారు. దీర్ఘకాలిక, తాత్కాలిక అవసరాలను కేంద్రమంత్రి దృష్టికి కార్మిక సంఘాల ప్రతినిధులు తీసుకెళ్లారు.
స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సహకరించాలని కేంద్రమంత్రిని ఎంపీలు, ఎమ్మేల్యేలు కోరారు. మరోవైపు అనకాపల్లి పర్యటనలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుంటాం అని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వమని ప్రకటన చేశారు. అబద్ధపు ప్రచారాలను నమ్మొద్దని సీఎం చంద్రబాబు కోరారు.