ప్రముఖ సీనియర్ నటి నమిత భర్త వీరేంద్ర చౌదరి కొంతకాలంగా ఓ చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ కేసుకు సంబంధించి ఇష్యూ మరోసారి తెరపైకొచ్చింది. ఈ మేరకు చిన్న, మధ్య తరహా పరిశ్రమల కౌన్సిల్ తమిళనాడు విభాగ అధ్యక్షుడి పదవి ఇప్పిస్తామంటూ సేలం నగరానికి చెందిన ముత్తురామన్ జిల్లాలోని అమ్మాపాళయం జాకిర్ ప్రాంతానికి చెందిన గోపాలస్వామి అనే వ్యక్తికి ఆశ చూపించినట్లు గతంలో పోలీసులు వెల్లడించారు. అయితే ఇందుకోసం గోపాలస్వామి దగ్గరి నుంచి ఏకంగా రూ. 50 లక్షల రూపాయలు వీరేంద్ర చౌదరి వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలోనే అదే పదవికి నటి నమిత భర్త చౌదరి ఇటీవలే నియమితులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న గోపాల స్వామి తాను మోసపోయినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముత్తురామన్‌తోపాటు కౌన్సిల్ జాతీయ కార్యదర్శి దుశ్యంత్ యాదవ్‌ను పోలీసులు గత 31న అరెస్ట్ చేశారు. ఇదే కేసుకు సంబంధించి తాజాగా సేలం సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు వీరేంద్ర చౌదరికి నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.
Also read :రష్మిక డీప్‌ఫేక్ వీడియో ఫస్ట్ అప్ లోడ్ చేసింది ఇతడే.. వెల్లడించిన ఢిల్లీ పోలీసులు
ఇదిలావుంటే.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత ఆద్వర్యంలో 2016లో అన్నాడిఎంకే పార్టీలో చేరింది నమిత. ఆ తర్వాత 2017లో వీరేంద్ర చైదరిని పెళ్లిచేసుకుంది. ఇక జయలలిత మరణానంతరం 2019లో బీజేపీలో చేరిన నమిత 8 నెలల్లోనే బీజేపీ కార్యవర్గ సభ్యురాలిగానూ నియమితురాలయ్యారు. గతేడాది కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసిన ఆమె 2024 పార్లమెంట్ ఎన్నికల కోసం కూడా తమిళనాడులో బీజేపీ ప్రచారం చేయబోతున్నట్లు తెలుస్తోంది.