వివేకా హత్యకు ఎంపీ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి కుట్ర చేశారు. వివేక పీఏ కృష్ణారెడ్డిపై అనుమానాలు ఉన్నప్పటికీ తగిన ఆధారాలు లభించలేదు. సాక్ష్యాల చెరిపివేత సమయంలో వైఎస్ మనోహర్‌రెడ్డి ఉన్నా.. ఆయన ప్రమేయం ఇంకా నిర్ధారణ కాలేదు. వివేకా లేఖపై నిన్న హైడ్రిన్ పరీక్ష నివేదిక రావాల్సి ఉంది. ఆయన ఇంట్లో వైఫై రూటర్లకు కనెక్టైన వారి వివరాలను సేకరిస్తున్నాం. దానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని అమెరికా అధికారులను కోరాం. పలు మొబైల్ ఫోన్ల ఫొరెన్సిక్ నివేదికలు త్రివేండ్రం సీ డాక్ నుంచి అందాల్సి ఉందని కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్‌లో సీబీఐ పేర్కొంది.
2019 మార్చి 14న పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. అయితే ఈ హత్య కేసును సీబీఐ విచారిస్తుంది. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఈ హత్య జరిగింది. ఈ హత్య కేసును విచారించేందుకు టీడీపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు అధికారంలో ఉన్న సీఎం జగన్ ప్రభుత్వం కూడ మరో సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ హత్య కేసును సీబీఐతో విచారించాలని వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి, టీడీపీ నేత బిటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిలు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ నిర్వహించిన హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. దీంతో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ విచారిస్తోంది.
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని సెకండ్ సప్లిమెంటరీ చార్జీషీట్‌లో ఎనిమిదో నిందితుడిగా సీబీఐ చేర్చింది. ఈ నెల 14న అవినాష్‌కి సమన్లు ఇచ్చింది. వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పొందారు.అయితే ఈ ముందస్తు బెయిల్‌ను సునీతారెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 18న సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. సునీతా దాఖలు చేసిన కేసులో సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో జూన్ 30న దాఖలు చేసిన ఛార్జిషీట్, కేసు డైరీని సీల్డ్ కవర్లో సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. అలాగే అవినాష్ ముందుస్తు బెయిల్ వ్యవహారంపై రెండు వారాల్లోపు రిప్లై దాఖలు చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం.త్రివేదీలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. అదే విధంగా.. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటికే ఉన్న ఆదేశాలు అన్ని యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కూడా అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌కు జత చేసింది. రెండు పిటిషన్లు కలిపే తదుపరి విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం తేల్చి చెప్పింది.