Case Filed Against Singer Chinmayi: గాయని, డబ్బింగ్ ఆర్టిస్టు చిన్మయి శ్రీపాద పై గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో (Gachibowli Police Station) కేసు నమోదు అయ్యింది. ఆమె రెండు రోజుల క్రితం భారతదేశం గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు గురించి హెచ్ సీయూ విద్యార్థి కుమార్ సాగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసి ఆమె పై కేసు నమోదు చేశారు.
ఓ ఇంటర్వ్యూలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ (Actor Annapurnamma) మహిళల వేషధారణ గురించి ప్రస్తావించారు.దానిని తప్పుపడుతూ సింగర్ చిన్మయి ఇన్ స్టా వేదికగా ఓ వీడియోను విడుదల చేసింది. అందులో చిన్మయి మాట్లాడుతూ.. '' భారతదేశాన్ని చెత్త దేశంగా, భారతదేశంలో పుట్టడం నా ఖర్మ అంటూ చిన్మయి వ్యాఖ్యానించింది.
ఆమె నటి అన్నపూర్ణమ్మకు ఏమైనా చెప్పాలి అనుకుంటే ఆమె పేరును మాత్రమే ప్రస్తావించాలి. అంతేకానీ యావత్ భారతదేశాన్ని అనడానికి ఆమెకు ఎలాంటి హక్కు లేదని సాగర్ పేర్కొన్నారు. భారత్ లో ఉంటూ భారత్ సౌకర్యాలు అన్నింటిని అనుభవిస్తూ , భారత్ లో పుట్టడమే ఖర్మ అనడం, భారత్ ను ఓ చెత్త దేశం అని అనడం చాలా బాధకరమంటూ బాధ్యత గల పౌరుడిగా భారత్ పట్ల అగౌరమైన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చినట్లు సాగర్ తెలిపారు.
అసలేం జరిగిందంటే.. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఓ ఇంటర్వ్యూలో అర్థరాత్రి స్వతంత్రం అనగానే ఆరోజుల్లో ఆడవాళ్లు బయటకు వచ్చేవాళ్లా.. ఆడదానికి అర్థరాత్రి 12 గంటల తరువాత ఏం పని. ఇప్పుడు ఎక్స్‌పోజింగ్ వెక్కవైపోయింది. ఎప్పుడూ ఎదుటివారిది మాత్రమే తప్పు అనకూడదు. మనవైపు కూడా కొంచెం ఉంటుందని తెలిపారు.
అన్నపూర్ణమ్మ వీడియో పై ఇన్ స్టా వేదికగా చిన్మయి ఓ వీడియోను విడుదల చేసింది. తనకు ఎంతో ఇష్టమైన ఓ నటి ఇలా మాట్లాడడంతో నా గుండె పగిలినట్లు అయ్యింది. అర్థరాత్రి ఎలాంటి హాస్పిటల్స్, డాక్టర్స్ ఉండరని, వాళ్లందరూ అమ్మాయిలు కాబట్టి అర్థరాత్రి ఇంట్లోనే ఉంటారని పేర్కొన్నారు. ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, యాక్సిడెంట్ అయినా సూర్యోదయం, సూర్యాస్తమయానికి మధ్యలోనే జరగాలని అర్థరాత్రి జరిగితే అమ్మాయిలను ఇంట్లోనే ఉంచాలని చిన్మయి ఘాటుగా స్పందించారు.
అన్నపూర్ణమ్మ చెప్పినట్లు చేస్తే పిల్లలు కూడా అర్దరాత్రి పూట పుట్టకూడదని, అమ్మాయిల వేషధారణ వల్లే ఇలా జరుగుతుందని అనుకునే ఇలాంటి వారు ఇంకా చాలా మందే ఉన్నారని చిన్మయి విరుచుకుపడ్డారు. ఇండియాలో ఆడపిల్లలుగా పుట్టడం మన ఖర్మ అంటూ చిన్మయి కటువుగా మాట్లాడింది.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే హెచ్‌సీయూ విద్యార్థి కుమార్ సాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.