Vanaparthy: వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి సంబరాల్లో ఉన్న కుటుంబాన్ని మృత్యువు కబళించింది. శుభం కార్డు పడాల్సిన ఇంట్లో మృత్యుఘోష వినిపించింది. కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. కొత్తకోట పట్టణం టెక్కలయ్య దర్గా సమీపంలో ఈ ప్రమాదం జరగగా మృతుల్లో ముగ్గురు చిన్నారులున్నారు.
మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసేందుకు వస్తుండగా..
ఈ మేరకు వనపర్తి జిల్లా ఎస్ఐ మంజునాథ్ రెడ్డి వివరాల ప్రకారం.. కర్నాటకకు చెందిన ఖాజా కుతుబ్షా అలియాస్ అలీకి హైదరాబాద్కు చెందిన అమ్మాయితో పెండ్లి కుదిరింది. అయితే మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసేందుకు అలీ కుటుంబం ఆదివారం రాత్రి బళ్లారి జిల్లా బసవన్నకుంట నుంచి మారుతి ఎర్టిగా కారులో హైదరాబాద్కు బయలుదేరింది. సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కొత్తకోట సమీపంలోని టెక్కలయ్య దర్గా వద్దకు రాగానే డ్రైవింగ్ చేస్తున్న అలీ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టిందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Telangana: ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్ రెడీ.. తొలి దశ అర్హులు వీరే!
పెళ్లి కొడుకు సీరియస్..
ఈ ప్రమాదంలో అలీ పెద్ద బావ రెహ్మాన్ (39), నానమ్మ సలీమాబీ (95), అక్క కూతుళ్లు రోష్ని (4), ఉమానా (2) స్పాట్లోనే అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన వాసిపా రిషత్ (7) హాస్పిటల్కు తరలిస్తుండగా చనిపోయినట్లు తెలిపారు. డ్రైవింగ్ చేసిన అలీతో పాటు ఆదిల్, షఫీ, హసన్, ఖదీరుమ్, షాజహాన్ బేగం, అబీబా తీవ్రంగా గాయపడ్డారని, వీరిని స్థానికులు వనపర్తి జిల్లాలోని హాస్పిటల్కు తరలించినట్లు వెల్లడించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మంజునాథ్ రెడ్డి తెలిపారు.