Darling: మహిళలను పలకరించే పద్ధతిపై కలకత్తా హైకోర్టు (Calcutta High Court) సంచలన తీర్పు వెల్లడించింది. పరిచయం లేని స్త్రీలను ‘డార్లింగ్’ (Darling)అని పిలవడం లైంగిక వేధింపేనని స్పష్టం చేసింది. ఇటీవల ఓ మహిళా కానిస్టేబుల్ కు సంబంధించిన ఇష్యూపై ఈ రోజు విచారణ జరిపిన న్యాయస్థానం అసభ్యంగా పిలిచిన వ్యక్తులను ఐపీసీ 354ఏ, 509 సెక్షన్ల కింద నేరస్థులుగా పరిగణించవచ్చని పేర్కొంది.
మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు..
ఈ మేరకు పోర్టు బ్లెయిర్‌లోని హైకోర్టు బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ జై సేన్‌గుప్తా తీర్పు వెలువడింది. అయితే గతేడాది అండమాన్ నికోబార్‌లోని మాయాబందర్ ప్రాంతంలో దుర్గా పూజ సందర్భంగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. విధుల్లో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్‌తో జనక్ రామ్ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో ఉన్న జానకి రామ్ ఆమెను డార్లింగ్ అంటూ పిలవడంతోపాటు ‘చలాన్ ఇవ్వడానికి వచ్చావా’ అంటూ దురుసుగా వ్యవహరించాడు. దీంతో అతనిపై మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: Yuzvendra Chahal: చాహల్‌ను పైకి ఎత్తిపడేసిన యువతి.. వీడియో వైరల్!
3 నెలల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా..
ఇక ఈ వివాదంపై నార్త్ - మిడిల్ అండమాన్ ఫస్ట్‌క్లాస్ కోర్టు విచారణ జరిపింది. జానకి రామ్ ను దోషిగా తేల్చుతూ 3 నెలల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ తీర్పును అడిషనల్ సెషన్స్ కోర్టులో అతడు సవాల్ చేయగా దానిని తిరస్కరించారు. అనంతరం కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ జై సేన్‌గుప్తా ధర్మాసనం ఫస్ట్‌క్లాస్ కోర్టు తీర్పును సమర్థించడంతోపాటు డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపేనని తెలిపారు. దీనిపై పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.