BY Vijayendra as Karnataka BJP Chief: కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంతి యడ్యూరప్ప తనయుడు విజయేంద్రను నియామకం అయ్యారు. ఈ మేరకు బీజేపీ అధిష్టానం శుక్రవారం నాడు ఒక ప్రకట విడుదల చేసింది. ఎమ్మెల్యే విజయేంద్ర యడ్యూరప్పను కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయించడం జరిగిందని, ఆయన నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అర్జున్ సింగ్ పేరిట ప్రకటన జారీ చేశారు. బీవై విజయేంద్ర ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. మరికొద్ది నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో విజయేంద్రకు పార్టీ పగ్గాలు అప్పగించడం వెనుక పక్కా వ్యూహం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. కాగా, ప్రస్తుతం కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న నళిన్ కుమార్ కటీల్ స్థానంలో విజయేంద్రను నియమించారు.
యడ్యూరప్ప తన కుమారుడిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేయాలని చాలా నెలల క్రితం నుంచే గట్టిగా లాబీయింగ్ చేస్తున్నట్లు కన్నడనాట వార్తలు గుప్పుమన్నాయి. దీనిని పార్టీ శ్రేణులు అంతర్గతంగా తీవ్రంగా వ్యతిరేకించారట. కుటుంబ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించే అవకాశం ఉందని, విజయేంద్రను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించొద్దని వైరి వర్గం గట్టిగానే పోరాడిందని టాక్. కానీ, లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా పార్టీ హైకమాండ్ చివరకు ఆయన్నే నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
యడ్యూరప్ప రాజకీయం..
బీవై విజయేంద్ర తండ్రి బీఎస్ యడ్యూరప్ప దేశ రాజకీయాల్లో సుపరిచతమైన వ్యక్తి. దక్షిణ భారతదేశంలో బీజేపీకి చెందిన కీలక నాయకులలో బి.ఎస్.యడ్యూరప్ప ఒకరు. ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా నాలుగుసార్లు పని చేశారు. మూడుసార్లు ప్రతిపక్ష నేతగా కూడా పని చేశారు. అంతేకాదు.. దక్షిణ భారతదేశంలోనే బీజేపీ తరఫున ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఏకైక నాయకుడిగా యడ్యూరప్ప రికార్డ్ క్రియేట్ చేశాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పార్టీకి సేవలందించారు యడ్యూరప్ప. ఈ పలుకుబడిని ఉపయోగించే ప్రస్తుతం తన తనయుడిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చేయగలిగారని చెప్పుకోవచ్చు.
Also Read:
లాస్ట్ మినిట్‌లో ట్విస్ట్.. మరో అభ్యర్థిని మార్చిన కాంగ్రెస్.. ఎవరంటే..