Share Market:
ఈ నెల మొదటి ట్రేడింగ్ రోజైన అక్టోబర్ 1న ఈరోజు ఉదయం లాభాల్లో మొదలైన స్టాక్ మార్కెట్ రోజంతా రోలర్ కోస్టర్ రైడ్‌లా సాగింది. సెన్సెక్స్ ఉదయం 84,257.17 పాయింట్ల దగ్గర స్వల్ప నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ.. కాసేపటికే లాభాల్లోకి వచ్చింది. ఇంట్రాడేలో 84,648.40 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొంది. చివరికి రోజు ముగిసేసరికి సెన్సెక్స్ 33 పాయింట్లు పడిపోయి 84,266 స్థాయి దగ్గర ముగిసింది. మరోవైపు నిఫ్టీ కూడా 15 పాయింట్లు క్షీణించి 25,796 దగ్గర ముగిసింది.
30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 16షేర్లు క్షీణించగా... 14 షేర్లు పెరిగాయి. 50 నిఫ్టీ స్టాక్స్‌లో 29 క్షీణించగా, 21 పెరిగాయి. ఎన్‌ఎస్‌ఈలో ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ అత్యధికంగా 0.67 శాతం పడిపోయింది. రిలయన్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, లార్సెన్ అండ్ టూబ్రోలు మార్కెట్ పతనానికి దోహదపడ్డాయి. ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు మాత్రమే మార్కెట్ను కాస్త కాపాడాయి.
ఆసియా మార్కెట్‌లో జపాన్‌కు చెందిన నిక్కీ 1.93%, హాంకాంగ్‌లోని హ్యాంగ్‌సెంగ్ సూచీ 2.43% చొప్పున పెరిగాయి. చైనా షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 8.06% లాభపడింది.సెప్టెంబర్ 30న, అమెరికా లోని డౌ జోన్స్ 0.04% పెరిగి 42,330 వద్ద మరియు నాస్డాక్ 0.38% 18,189 వద్ద ముగిసింది. S&P 500 కూడా 0.42% పెరిగి 5,762కి చేరుకుంది. ఎన్‌ఎస్‌ఈ డేటా ప్రకారం సెప్టెంబర్ 30న విదేశీ ఇన్వెస్టర్లు రూ.9,791 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ కాలంలో దేశీయ ఇన్వెస్టర్లు రూ.6,645 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. డాలరుతో 83.82 దగ్గర స్థిరడింది. ఇక రేపు గాంధీ జయంతి సందర్భంగా మార్కెట్ సెలవు ఉంటుంది, మళ్ళీ గురువారం నాడు తెరుచుకుంటాయి.