RBI: బిగ్ షాక్.. సహకారి బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI

RBI సంచలన నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలోని జిజామాతా మహిళా సహకారి బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసింది. తగిన మూలధనం లేకపోవడం, ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో ఈ బ్యాంకును పూర్తిగా మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 7 నుంచి కార్యకలాపాలు నిలిపివేసింది.

New Update
RBI-Jijamata-Mahila-Bank-Licence-Cancelled

RBI-Jijamata-Mahila-Bank-Licence-Cancelled


మహారాష్ట్రలోని సతారా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జిజామాతా మహిళా సహకారి బ్యాంక్ లిమిటెడ్ (Jijamata Mahila Sahakari Bank Ltd) లైసెన్స్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్యాన్సిల్ చేసింది. బ్యాంకు ఆర్థిక పరిస్థితి క్షీణించడం, తగినంత మూలధనం లేకపోవడం, నిబంధనలను ఉల్లంఘించడం వంటి కారణాల వల్ల ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. వెంటనే ఈ బ్యాంకు తన బ్యాంకింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు అక్టోబర్ 7, 2025 పనివేళలు ముగిసినప్పటి నుంచి అమలులోకి వచ్చాయి.

లైసెన్స్ క్యాన్సిల్‌కు కారణాలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో జిజామాతా మహిళా సహకారి బ్యాంక్ లైసెన్స్ రద్దుకు గల రెండు ప్రధాన కారణాలను వెల్లడించింది. 

తగినంత మూలధనం లేకపోవడం: బ్యాంకు వద్ద తగినంత మూలధనం, ఆదాయ సంపాదన అవకాశాలు లేవని తెలిపింది. భవిష్యత్తులో కూడా బ్యాంకు తన కార్యకలాపాలను కొనసాగించేందుకు సరిపడా మూలధనం సమకూర్చుకునే పరిస్థితి కనిపించలేదని వెల్లడించింది.

నిబంధనల ఉల్లంఘన: బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 లోని కీలక నిబంధనలను ఈ బ్యాంకు ఉల్లంఘించిందని తెలిపింది. 

ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని బట్టి చూస్తే.. బ్యాంకు తన డిపాజిటర్లకు పూర్తి మొత్తాన్ని చెల్లించగలిగే స్థితిలో లేదని ఆర్‌బీఐ అంచనా వేసింది. అందువల్ల ఇలాంటి సమయంలో బ్యాంకు తన బ్యాంకింగ్ కార్యకలాపాలను కొనసాగించడానికి అనుమతిస్తే అది డిపాజిటర్ల ప్రయోజనాలకు హానికరమని ఆర్‌బీఐ పేర్కొంది. అందుకే ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ బ్యాంకు బ్యాంకింగ్ వ్యాపారాన్ని తక్షణమే ఆపాలని మహారాష్ట్ర కో-ఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రార్, కమిషనర్‌ను RBI కోరింది. అలాగే బ్యాంకు లిక్విడేటర్ ను నియమించాలని ఆదేశించింది. 

గతంలో కూడా రద్దు:

జిజామాతా మహిళా సహకారి బ్యాంకు లైసెన్స్ రద్దు కావడం ఇది మొదటిసారి కాదు. అంతకుముందు 2016 జూన్ 30న కూడా ఆర్బీఐ ఈ బ్యాంకు లైసెన్స్‌ను రద్దు చేసింది. అయితే, బ్యాంకు అప్పీల్ చేయడంతో 2019 అక్టోబర్ 23న లైసెన్స్ తిరిగి పునరుద్ధరించబడింది. అయినప్పటికీ బ్యాంకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడకపోవడంతో RBI మరోసారి లైసెన్స్‌ను రద్దు చేసింది.

ఖాతాదారుల పరిస్థితి ఏంటి?

బ్యాంకు లైసెన్స్ రద్దు అవడంతో ఖాతాదారులలో ఆందోళన నెలకొంది. అయితే డిపాజిటర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) ద్వారా భీమా రక్షణ ఉంటుందని RBI తెలిపింది. 

రూ.5 లక్షల వరకు భీమా: DICGC చట్టం 1961 ప్రకారం.. జిజామాతా మహిళా సహకారి బ్యాంకులోని ప్రతి డిపాజిటర్‌కు గరిష్టంగా రూ.5 లక్షల వరకు డిపాజిట్ బీమా క్లెయిమ్ మొత్తాన్ని తిరిగి పొందేందుకు అవకాశం ఉంటుంది.

94.41 శాతం మందికి పూర్తి రక్షణ: బ్యాంకు సమర్పించిన గణాంకాల ప్రకారం.. మొత్తం డిపాజిట్లలో దాదాపు 94.41 శాతం DICGC భీమా పరిధిలోకి వస్తాయి. అంటే ఈ డిపాజిటర్లకు వారి డబ్బు పూర్తిగా తిరిగి లభిస్తుంది. లిక్విడేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత DICGC ద్వారా డిపాజిట్ల చెల్లింపులు ప్రారంభం కానున్నాయి.

బ్యాంకు మూసివేతతో ఈ బ్యాంకు నుంచి ఎలాంటి డిపాజిట్లను స్వీకరించడం లేదా చెల్లించడం చేయరాదని ఆర్బీఐ స్పష్టం చేసింది. లిక్విడేషన్ ప్రక్రియ ప్రారంభం కాగానే, DICGC చట్టం ప్రకారం డిపాజిటర్లకు పరిహారం చెల్లించే ప్రక్రియ మొదలవుతుంది.

Advertisment
తాజా కథనాలు