Stock Market Today:
ఎంఎక్స్ ప్లేర్ ఇప్పుడు అమెజాన్‌లో కలిసిపోయింది. తన స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ మినిటీవీలో దీన్ని కలిపేసి అమెజాన్ ఎంఎక్స్ ప్లేర్‌గా తీసుకొస్తున్నామని అమెజాన్ ప్రకటించింది. ఇందులో పెద్ద సంఖ్యలో ప్రేక్షకులకు ఉచితంగా ప్రీమియం కంటెంట్‌ను అందించనున్నట్లు తెలిపింది. ఎంఎక్స్ ప్లేయర్ సేవలను యాప్, అమెజాన్.ఇన్ షాపింగ్ యాప్, ప్రైమ్ వీడియో, ఫైర్ టీవీ కనెక్ట్‌డ్ టీవీల్లో చూడొచ్చు. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ విలీనం ఆటోమేటిక్‌గా జరిగిపోతుందని, ఇందుకోసం యాప్‌ని రీ ఇన్‌స్టాల్ గానీ, అప్‌గ్రేడ్ గానీ చేయాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పింది.
ఇక ఈ రోజు కూడా వరుసగా ఆరో రోజు దేశీ స్టాక్ మార్కెట్ నష్టపోయాయి. గత వారం నష్టాలను కొనసాగించింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొని..చివరకు నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా ఎఫ్‌ఐఐల అమ్మకాలు, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం వంటి కారణాలతో పతనమయ్యాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ ఉదయం 81,926.99 పాయింట్ల దగ్గర లాభాల్లో ప్రారంభమై.. ఇంట్రాడేలో 82,137.77 వద్ద గరిష్ఠాన్ని తాకింది. తర్వాత నష్టాల్లోకి జారుకున్న సూచీ.. ఇంట్రాడేలో 80,726.06 దగ్గర అడుగుకు పడిపోయింది. చివరికి 638.45 పాయింట్ల నష్టంతో 81,050 దగ్గర ముగిసింది. నిఫ్టీ సైతం రోజు ముగిసేసరికి 218.85 పాయింట్ల నష్టంతో 24,795.75 దగ్గర ఉండిపోయింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.99గా ఉంది. అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగియగా.. ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ షేర్లు లాభపడ్డాయి.