గత ప్రభుత్వం జిల్లాల విభజనను ఇష్టారీతిన చేసిందని నిన్న ఓ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పిన విషయం తెలిసిందే. జిల్లాల పునర్విభనకు కమిటీ వేస్తామని ఆయన చెప్పడం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. జిల్లాల సంఖ్య తగ్గించేందుకు కమిటీ వేస్తామని రేవంత్ రెడ్డి అన్నారని ఫైర్ అయ్యారు. కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ఈ రోజు జరిగిన జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కొన్ని చోట్ల ఓటమిని ఊహించలేదని కేటీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: BIG BREAKING : నెల రోజుల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
జుక్కల్ లో ఓడిపోతామనుకోలేదు..
జుక్కల్ నియోజకవర్గంలో హనుమంత్ షిండే ఓడిపోతారనుకోలేదని ఆయన అన్నట్లు తెలుస్తోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని చిత్ర విచిత్రాలు జరిగాయని కేటీఆర్ అన్నారు. తొందరపడి ప్రభుత్వంపై విమర్శలు చేయడం లేదని కేటీఆర్ నేతలతో చెప్పారు. ప్రజల్లో కేసీఆర్‌కు ఆదరణ ఏమాత్రం తగ్గలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు సిట్టింగ్‌లను మార్చాల్సిందని అన్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ ను విమర్శిస్తే వదిలిపెట్టం..
అయితే.. గతంలో చేసిన పొరపాట్లు లోక్‌సభ ఎన్నికల్లో జరగవని కేటీఆర్ అన్నట్లు సమాచారం. కాంగ్రెస్ అనవసరంగా బీఆర్‌ఎస్‌ను విమర్శిస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేటీఆర్ అన్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగబోతోందని కేటీఆర్ అన్నారు.
లాభం బీఆర్ఎస్ కే..
అయితే.. త్రిముఖ పోరులో లాభపడేది BRS మాత్రమేనని కేటీఆర్ చెప్పినట్లు సమాచారం. BRSపై దళితబంధు, బీసీ బంధు వంటి పథకాల ప్రభావం పడిందని కేటీఆర్ అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. కొందరికి పథకాలు వస్తే..మిగతా వాళ్లు ఈర్ష్య పడే పరిస్థితి సమాజంలో ఉందని ఆయన చెప్పినట్లు సమాచారం.