బీఆర్ఎస్ కీలక నేత కొప్పుల హరీశ్వర్ రెడ్డి (Koppula Hareeshwar Reddy) కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతూ చికిత్స తీసుకుంటున్న హరీశ్వర్ రెడ్డి శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పరిగి నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గం నుంచి హరీశ్వర్ రెడ్డి కుమారుడు మహేశ్ రెడ్డి (Koppula Mahesh Reddy) ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ (CM KCR), మంత్రి కేటీఆర్ (Minister KTR), బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో (G Kishan reddy) పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. నేడు పరిగి పట్టణంలో హరీశ్వర్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హరీశ్వర్ రెడ్డికి నివాళులర్పించేందుకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తదితరులు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
హరీశ్వర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి 1985, 1994, 1999, 2004, 2009లో విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఓ సారి ఆయన శాసనసభ డిప్యూటీ స్పీకర్ గాను సేవలు అందించారు. అనంతరం తెలుగుదేశం పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన హరీశ్వర్ రెడ్డి 2014లో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి విజయం సాధించారు.
ఇది కూడా చదవండి: Telangana Elections: మల్కాజ్‌గిరి బీఆర్‌ఎస్ అభ్యర్థిపై ఉత్కంఠ.. పోటీలో నిలిచేది ఆయనేనా?
తర్వాత అనారోగ్య కారణాలతో రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో.. 2018లో హరీశ్వర్ రెడ్డి పోటీ చేయకుండా తన కుమారుడు మహేశ్ రెడ్డిని టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దించారు. మహేశ్ రెడ్డి ఆ ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రానున్న ఎన్నికల్లోనూ మహేశ్ రెడ్డికి మరో సారి టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. దీంతో ఆయన పోటీకి సిద్ధం అవుతున్నారు.