58 Seats to Upper Caste: బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా వచ్చేసింది. ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ (CM KCR) సోమవారం మధ్యాహ్నం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఒక పది మంది మినహా అంతా సిట్టింగ్‌లకే మళ్లీ అవకాశం ఇచ్చారు. ఇక అభ్యర్థుల అంతా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమవ్వడమే. అన్ని పార్టీల కంటే ముందగా గులాబీ బాస్ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల యుద్ధంలోకి ముందే కాలు దువ్వారు. అయితే కేసీఆర్ ప్రకటించిన లిస్టుపై ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. అదేంటంటే ఈ లిస్టులో సగానికి పైగా అగ్రకులాలు వారే ఉండటం. నా బీసీలు, దళితులు అని చెప్పుకునే కేసీఆర్.. వారిని సీట్ల విషయంలో మాత్రం పక్కబెట్టడం గమనార్హం. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
115 మందిలో 58మంది అగ్రకులాలే..
115 మంది అభ్యర్థుల్లో 58 మంది ఓసీ అభ్యర్థులే ఉన్నారు. ఇందులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు 40 మంది ఉండగా, వెలమలు 12(కేసీఆర్ రెండు సీట్లతో కలిపి) మంది, కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు 6 మంది, బ్రాహ్మణులు, వైశ్యులు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఇక బీసీల నుంచి 23 మందికి అవకాశం కల్పించారు. ఎస్సీ, ఎస్టీలకు కలిపి 28 సీట్లు కేటాయించారు. మొత్తంగా చూసుకుంటే బీసీలు, దళితులకు కలిపి 51 సీట్లు మాత్రమే ఇచ్చారు. అంటే అగ్రకులాల కంటే తక్కువ అన్న మాట. ఇప్పుడు దీనినే విపక్షాలు అస్త్రంగా మలుచుకుంటున్నాయి. వెనకబడిన, బలహీన వర్గాలకు ఎక్కువ సీట్లు కేటాయించకుండా కేసీఆర్ అగ్రకులాల పక్షపాతి అనే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.
బీసీలకు తీవ్ర అన్యాయం..
ఇక టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరగడంపై బీసీల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో 60శాతం ఉన్న బీసీలకు 20శాతం టికెట్లు మాత్రమే ఇచ్చారని మండిపడుతున్నారు. 5శాతం ఉన్న రెడ్లకు 33శాతం, అర శాతం ఉన్న వెలమలకు 16శాతం టికెట్లు ఎలా కేటాయిస్తారని నిలదీస్తున్నారు. కేసీఆర్‌కు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.
కేసీఆర్‌పై తిరుగుబావుటా..
మరోవైపు టికెట్ల రాని అభ్యర్థులు బాహాటంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ అధిష్టానంపై తిరుగుబావుటా ఎగురవేశారు. ఆమె భర్త శ్యామ్ నాయక్ సోమవారం రాత్రే రేవంత్ రెడ్డి, ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇవాళ రేఖా నాయక్ కూడా ఖర్గే సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇక నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు. ఆయన కూడా గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుందుకు రెడీ అయ్యారు.
మైనంపల్లిపై కేసీఆర్, కేటీఆర్ ఆగ్రహం..
ఇక మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మంత్రి హరీష్‌రావు (Minister HarishRao)పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే మైనంపల్లి వ్యాఖ్యలను కేసీఆర్‌తో పాటు కేటీఆర్ (KTR) తీవ్రంగా ఖండించారు. ఇతర బీఆర్‌ఎస్ నేతలు కూడా మైనంపల్లిపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను బీఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈలోపే మైనంపల్లి పార్టీకి రాజీనామా చేసి గులాబీ బాస్‌కు షాక్ ఇస్తారో? లేదో? వేచి చూడాలి.
Also Read: ఈటల రూట్ ఎటు? హుజూరాబాద్ ను వదులుకుంటారా?