లోక్ సభ ఎన్నికల (Loksabha Elections 2024) షెడ్యూల్ విడుదల కావడంతో గులాబీ బాస్ కేసీఆర్ (KCR) ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పదికి పైగా స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేశారు ఆయన. తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి అభ్యర్థులను కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నల్గొండ ఎంపీ అభ్యర్థిక కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి అభ్యర్థిగా బూడిద భిక్షమయ్య గౌడ్ పేర్లను కేసీఆర్ (KCR) డిసైడ్ చేసినట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం. కంచర్ల కృష్ణారెడ్డి నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సోదరుడు.
ఇది కూడా చదవండి: మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి ఫైనల్.. ఆ నేత వైపే కేసీఆర్ మొగ్గు?
ఆయన మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ పార్టీ టికెట్ ను ఆశించారు. ఉమ్మడి జిల్లాలో ఆయనకు విస్తృతంగా పరిచయాలు ఉన్నాయి. పార్టీ శ్రేణులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పేరును కేసీఆర్ ఫైనల్ చేసినట్లు సమాచారం. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సైతం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారినే అభ్యర్థులుగా ప్రకటించాయి. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి, బీజేజీ నుంచి మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి బరిలో ఉన్నారు.
భువనగిరి అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్ ను బీజేపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాము కూడా బీసీ అభ్యర్థినే బరిలోకి దించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. క్యామ మల్లేష్, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ తదితరులు టికెట్ కోసం పోటీ పడగా.. బూడిద భిక్షమయ్య గౌడ్ పేరునే కేసీఆర్ ఫైనల్ చేశారు. భిక్షమయ్య గౌడ్ గతంలో ఆలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా ఆయనకు విస్తృత సంబంధాలు ఉన్నాయి. ఇంకా ఈ నియోజకవర్గంలో గౌడ సామాజికవర్గానికి చెందిన వారి ఓటింగ్ అధికంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు బీఆర్ఎస్ టికెట్ దక్కిందన్న ప్రచారం సాగుతోంది.