బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు భారత జట్టు ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వెళ్లనుంది. ఈ టెస్టు సిరీస్ షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం వెల్లడించింది. 1991-92 నుంచి బోర్డర్ గ్రావస్కర్ ట్రోఫీ జరుగుతుండగా.. అడిలైడ్‌లో తొలి టెస్టు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి పేస్‌కు అనుకూలించే పెర్త్ స్టేడియం నుంచి మొదటి టెస్టు ప్రారంభం కానుంది.
నవంబర్ 22-26 తేదీల మధ్య పెర్త్ వేదికగా తొలి టెస్టు జరగనుండగా.. డిసెంబర్ 6-10 తేదీల మధ్య అడిలైడ్ వేదికగా రెండో టెస్టు జరగనుంది. ఇది డే అండ్ నైట్ టెస్ట్ కావడంతో పింక్ బాల్‌తో నిర్వహించనున్నారు. భారత జట్టు ఆడనున్న ఐదో డే అండ్ నైట్ టెస్ట్ ఇది కాగా.. 2020 డిసెంబర్ తర్వాత ఆస్ట్రేలియాతో రెండోది. 2020లో అడిలైడ్ వేదికగా జరిగిన డే అండ్ నైట్ టెస్టులో కోహ్లి సేన 36 పరుగులకే ఆలౌటయ్యింది. భారత జట్టుకు టెస్టుల్లో ఇదే అత్యల్ప స్కోరు. ఆ టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
డిసెంబర్ 14న బ్రిస్బే్న్లోని గబ్బా వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది. డిసెంబర్ 26న మొదలయ్యే బాక్సింగ్ డే టెస్ట్‌కు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2025 జనవరి 3న సిడ్నీ వేదికగా చివరి టెస్టు ప్రారంభం కానుంది. ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సైకిల్ కీలకమైన ఈ సిరీస్ సిడ్నీ టెస్టుతో ముగియనుంది.1991-92 నుంచి ఇరు దేశాల మధ్య బోర్డర్ గావస్కర్ ట్రోఫీని నిర్వహిస్తుండగా.. భారత జట్టు వరుసగా మూడుసార్లు ఈ ట్రోఫీని నిలబెట్టుకుంది. 2018-19తోపాటు 2020-21ల్లో ఆస్ట్రేలియా గడ్డ మీద భారత్ టెస్టు సిరీస్ విజయాలు సాధించింది.
బోర్డర్ గావస్కర్ ట్రోఫీ జరుగుతున్న సమయంలోనే భారత మహిళల జట్టు వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. మహిళల జట్ల మధ్య తొలి వన్డే డిసెంబర్ 5న జరగనుండగా.. డిసెంబర్ 8న రెండో మ్యాచ్, డిసెంబర్ 11న మూడో మ్యాచ్ జరగనుంది. రెండో మ్యాచ్ మినహా మిగతా రెండు డై అండ్ నైట్ మ్యాచ్‌లు కావడం గమనార్హం.