/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/hyderabad-Alert-jpg.webp)
High Alert In Hyderabad: బెంగళూరు పేలుడు ఘటనతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. కీలక ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రద్దీ ప్రాంతాలతో పాటు... మాల్స్ లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. కొన్ని చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసి.. అనుమానాస్పద వెహికిల్స్‌ను తనిఖీ చేస్తున్నామన్నారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులను అప్రమత్తం చేశామని తెలిపారు. బెంగళూరు పేలుళ్ల వెనుక కారణాలు తెలుసుకుంటున్నామని అన్నారు.
అసలేం జరిగిందంటే..
కర్ణాటకలోని బెంగళూరులో ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిగిన విషయం తెలిసిందే. గ్యాస్ సిలిండర్ పేలిందేమోనని అందరు అనుకున్నారు. కానీ ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆ కేఫ్‌లో బ్యాగ్ పెట్టాడని.. అందులో నుంచే పేలుడు సంభవించినట్లు కర్ణాటక సర్కార్ నిర్ధారించింది. ఈ విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య (Karnataka CM Siddaramaiah) తెలిపారు. ఓ వ్యక్తి కేఫ్‌లో బ్యాగు పెట్టి వెళ్లిపోవడం.. సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయినట్లు పేర్కొన్నారు. ఆ బ్యాగులో ఐఈడీ (IED) ఉండటం వల్లే పేలుళ్లు జరిగినట్లు చెప్పారు.
9 మందికి తీవ్ర గాయాలు
అయితే ఈ పేలుడు ప్రభావానికి 9 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. పేలుడు జరిగిన వెంటనే భయంతో.. హోటల్ సిబ్బంది, కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. అక్కడికి చేరుకున్న బాంబు స్క్వాడ్, క్లూస్ టీం అధికారులు ఆ పేలుడుకు సంబంధించి ఆధారాలను సేకరించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘటనపై వివరాలివ్వాలి
ఇదిలాఉండగా.. కేఫ్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వీ యాదవ్.. రామేశ్వరం కేఫ్ ఫౌండర్ అయిన నాగరాజుకు ఫోన్ చేశారు. తమ కేఫ్‌లో గ్యాస్ సిలిండర్ పేలలేదని.. ఓ కస్టమర్ వదిలిపెట్టిన బ్యాగులో నుంచి పేలుడు సంభవించినట్లు నాగరాజు వివరించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా వివరాలు ఇవ్వాలని ఎంపీ తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు.