Sandeep Vanga: సినిమా అంటే వినోదం. అది ఒకప్పటి మాట. సినిమా అంటే వివాదం.. ఇది ఇప్పటి మాట. నా సినిమా నా ఇష్టం అనే వాళ్ళు.. నా సినిమాని ఏమన్నా అంటే ఊరుకునేది లేదంటూ ఉరిమే వాళ్ళూ.. మేమేది చేసినా చూసే జనాలున్నారు మీకేంటి అంటూ.. కల్ట్ సినిమా పేరుతో మృగాలను వదిలేవాళ్ళూ ఇప్పుడు మన సినిమా దర్శకులు. ఒక కథ అంటే అన్యాయం చేసేవాడు ఒక వైపు.. ధర్మం కోసం పోరాడే వాడు మరో వైపు.. ఇద్దరి మధ్యలో వచ్చే సంఘర్షణ.. ధర్మాన్ని గెలిపించే కథనం. అధర్మ యుద్ధం చేసేవాడు విలన్ అయితే, అన్యాయంపై పోరు చేసేవాడు హీరో. ఇదంతా గతం. ఇప్పుడు ఎంత అధర్మంగా.. ఎంత క్రూరంగా.. ఎంతమందిని చెరిస్తే.. మరెంతమందిని నరికి అవతల పారేస్తే అదే సినిమా.. వాడే హీరో. చాలామంది నేటితరం దర్శకులు దానికి ఫిక్స్ అయిపోయారు. అధర్మ పాలకుడు.. అన్యాయ రక్షకుడు జగజ్జేత అంటూ హీరోలా చూపిస్తూ వెండితెర ప్రతిష్టను బుగ్గిపాలు చేసేస్తున్నారు.
ఇప్పుడు ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే, ఇటీవల యానిమల్ (Animal Movie) అనే సినిమా వచ్చింది. కోటను కోట్ల రూపాయలను తన ఎకౌంట్లో వేసుకుంది. సినిమా అంటే ఇదిరా అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో.. ఇదేం సినిమారా బాబూ అన్నవారు అంతకంటే ఎక్కువే ఉన్నారు. కల్ట్ సినిమా పేరుతో ప్రచారం పొందిన ఈ సినిమాపై విమర్శల జడి సినిమా థియేటర్ల లోంచి ఓటీటీకి (OTT) మారిన తరువాత మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో సినిమా పై వస్తున్న విమర్శలు.. ఆ విమర్శలపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేస్తున్న ప్రతి విమర్శలతో ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ మీడియా హోరెత్తిపోతోంది. ఏ సినిమా అయినా విమర్శించేవారు కచ్చితంగా ఉంటారు. విమర్శలన్నిటికీ దర్శకుడు స్పందించాలని రూలేమీ లేదు. తనకిష్టమైనది తాను తీస్తే.. తనకు నచ్చని విషయాన్ని చెప్పే హక్కు కూడా ప్రేక్షకులకు ఉంటుంది. కానీ, యానిమల్ సినిమా విషయంలో ఈ చిన్న లాజిక్ మర్చిపోయి దర్శకుడు సందీప్ వంగా వ్యవహరిస్తున్నారని బాలీవుడ్ (Bollywood) సినీ జనాలతో పాటు ప్రేక్షకులు కూడా చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది.
ఎందుకంటే, యానిమల్ సినిమాని ఎవరు విమర్శించినా.. సందీప్ వంగా వైల్డ్ గా రియాక్ట్ అవుతున్నాడు. ఆమధ్య బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు (Kiran Rao) యానిమల్ సినిమాపై విమర్శలు చేశారు. అంతే.. దానికి చాలా అభ్యంతరకరమైన భాషతో విరుచుకు పడ్డారు సందీప్ వంగా. తాజాగా జావేద్ అక్తర్ (Javed Akhtar) కూడా యానిమల్ సినిమా పై కామెంట్స్ చేశారు. దానికి కూడా సందీప్ నోరేసుకుని పడిపోయారు. ఇక్కడ విషయం ఏమిటంటే సినిమా అనేది ఒక ఆర్ట్. అది అందరికీ నచ్చాలని లేదు. నచ్చకపోతే చెప్పకూడదనీ లేదు. కానీ, నచ్చలేదు అని చెప్పినవారిపై నోరు పారేసుకోవడం కరెక్ట్ కాదు కదా. విమర్శ వచ్చినపుడు.. దానికి సంబంధించిన సమాధానం చెప్పడం ఒక పద్ధతి. లేదా మాట్లాడకుండా వదిలేయడం అన్నిటినీ మించిన మంచి విధానం. నువ్వు తీసింది కరెక్ట్ అని నువ్వనుకున్నప్పుడు విమర్శలకు అతిగా స్పందించాల్సిన అవసరం ఏముంటుంది? ఇది సందీప్ వంగ విషయంలో బాలీవుడ్ లో అడుగుతున్న ప్రశ్న.
తన సినిమా బాలేదు అన్నందుకు సినీ ప్రముఖులను ఒక్కరినే సందీప్ (Sandeep Vanga) ఇలా అంటున్నాడు అని అనుకోవడానికి ఏమీ లేదు. ఈయన గతంలో సినిమా పై రివ్యూ రాసే వాళ్ళను చాలా చిల్లరగా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక రివ్యూవర్ ని బాడీ షేమింగ్ చేసిన వీడియోలూ సోషల్ మీడియాలో కనిపించాయి. ఒక సీన్ గురించి విమర్శ వస్తే అది అలా ఎందుకు తీశామనేది చెప్పగలిగితే చెప్పాలి.. లేకపోతే వదిలేయాలి. కానీ.. వ్యక్తిగత దూషణలకు దిగడం మంచిది కాదు అని సినీమా వర్గాల్లో చాలామంది అంటున్న మాట.
Also Read: పనికిరావన్న వారితోనే పల్లకీ మోయించుకున్న గానలత
నో డౌట్.. టాలీవుడ్ సినిమా ప్రపంచాన్ని ఏలుతోంది. అందుకు చాలా సినిమాలు కారణం. రాజమౌళి వంటి వారు వేసిన పునాదులపై.. టాలీవుడ్ దర్శకులు తమ టాలెంట్ చూపిస్తూ తెలుగు సినిమా జెండాను ఎగరవేస్తున్నారు. సినిమా ఎలా తీశారన్నది పక్కన పెడితే.. మన టాలెంట్ బాలీవుడ్.. హాలీవుడ్ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం అనేది చాలా సంతోషించాల్సిన విషయమే. అయితే, ఒకటి రెండు సినిమాలకే మనం ప్రపంచ సినిమా దిక్సూచులం అనేంత బిల్డప్ పనికిరాదు కదా. యానిమల్ ఒక హిట్ సినిమా. సినిమా హిట్ కావడానికి కారణాలు చాలా ఉండవచ్చు. అలా అని సినిమాని అందరూ మెచ్చాలని లేదు. కచ్చితంగా నచ్చకపోతే మాట్లాడతారు. దానిని తప్పుపడుతూ ఎగిరెగిరి పడటం తెలుగు సినిమా టాలెంట్ పై పెరిగిన ప్రపంచ ఖ్యాతిని అవమానించడం అవుతుంది. మాట జారడం వేరు.. తూలడం వేరు.. సినిమాలో హీరోతో మాటలు తూలేలా చేయడం.. నిజ జీవితంలోనూ కరెక్ట్ అనుకోవడం కరెక్టేనా అనేది ఆలోచించాలని యానిమల్ దర్శకుడి విషయంలో సినీ ఇండస్ట్రీలో చాలామంది సలహా ఇస్తున్నారు. పెద్ద పెద్ద టాలెంట్ ఉన్నవాళ్లే తమ మిస్ బిహేవియర్ తో తలబిరుసుతో కనుమరుగైపోయిన ఉదంతాలు మన సినీ ఇండస్ట్రీలో చాలా ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు. తీసింది మూడు సినిమాలు.. అందులో ఒకటి రీమేక్.. ఇంతలోనే అంత పొగరు అవసరమా అని వారు ప్రశ్నిస్తున్నారు.
నీకు నచ్చింది నువ్వు తీసుకో.. నచ్చిన వాడు చూసి చప్పట్లు కొడతాడు.. నచ్చని వాడు నచ్చలేదంటూ కచ్చితంగా చెబుతాడు. పాప్యులర్ కావడానికి నువ్వెంచుకున్న దారి కల్ట్ సినిమా కావచ్చు. కానీ, సినిమా అంటే అదొక్కటే కాదు. ఇండస్ట్రీ అంటే నువ్వు మాత్రమే తీసే సినిమాలు కూడా కాదు అంటూ బాలీవుడ్ లోనే కాదు సౌత్ ఇండస్ట్రీలోనూ సందీప్ వంగ గురించి అనుకుంటున్నారు.
Watch this Interesting Video :