/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Blood-Pressure-.png)
Blood Pressure: ఆరోగ్యంగా ఉండడం ఉండకపోవడం మన చేతుల్లోనే ఉంటుంది. రేపటి ఆరోగ్యం మన అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. అనారోగ్యానికి కారణమయ్యే అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆ అలవాట్లు ఏమిటో అందరికీ తెలుసు. అయినా కూడా వాటిని పెద్దగా పట్టించుకోము. ఎప్పుడైనా సరే మనకు ఆరోగ్య సమస్యలు వచ్చినపుడు దాని మూలకారణాన్ని తెలుసుకోవాలి. ఆ అనారోగ్యానికి కారణమైన అలవాట్లను దూరంగా పెట్టాలి. హడావుడి జీవితం, ఆహారపు అలవాట్లలో మార్పులు, అధిక బరువు, పని ఒత్తిడి, కాలుష్యం... మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆధునిక సాంకేతికత మనిషిని కదలనీయకుండా చేసింది. దీంతో మనిషి జీవనశైలి మారిపోయింది. ఆహారపు అలవాట్లలో తేడా వచ్చింది. ఇంటికి, ఒంటికి, పనికి తగని పాశ్చాత్య సంస్కృతిని దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో మునుపటి దృఢత్వం మాయమైపోయింది.
ప్రస్తుత తరాన్ని కలవరపెడుతున్న సమస్య “ఒత్తిడి”. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఒత్తిడికి ప్రధాన కారణాలలో ఒకటి జీవనశైలి. జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు- ప్రపంచీకరణ ఒత్తిడి కారణంగా రక్తపోటు అంటే మనం వాడుకగా చెప్పుకునే బీపీ కేసులు పెరుగుతున్నాయి. అయితే, బీపీ ఉండనే విషయం కూడా చాలా ఆలస్యంగా తెలుస్తుంది. అందుకే బీపీని సైలెంట్ కిల్లర్ అంటారు డాక్టర్లు. హైపర్‌టెన్షన్ యువత హృదయాలను నిశ్శబ్దంగా పిండుతుంది. మూత్రపిండాల పనితీరును మారుస్తుంది. పక్షవాతంతో పాటు జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఇది గుండె జబ్బులు - క్యాన్సర్‌కు కూడా కారణమవుతుంది. చిన్న వయసులోనే బీపీతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. వృద్ధులలో అధిక రక్తపోటు సమస్యలు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుందని సాధారణంగా అనుకుంటాం. కానీ ఇప్పటి పరిస్థితుల్లో ఈ సమస్యలు 30 ఏళ్లలోపు వారిని కూడా ప్రభావితం చేస్తున్నాయి. కొందరికి జన్యుపరమైన కారణాలు ఉండవచ్చు...కానీ ఇటీవలి జీవనశైలి మార్పుల వల్ల యువత ప్రభావితమవుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరికి రక్తపోటు(Blood Pressure) వస్తుంది. 30-79 ఏళ్ల వయసున్న 18.8 మిలియన్ల మంది భారతీయులు రక్తపోటుతో బాధపడుతున్నారని డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక వెల్లడించింది. ఇండియన్ హైపర్‌టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్ (IHCI) జూన్ 2023 నాటికి అధిక రక్తపోటుతో బాధపడుతున్న 58 లక్షల మందికి చికిత్స చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read: మధుమేహం ఉన్నవారు పాలు, పెరుగు తింటే ఏమవుతుంది..వైద్యులు ఏమంటున్నారు..?
అధిక రక్తపోటు కారణంగా గుండెపోటు, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఇటీవల పెరుగుతున్నాయి. ముఖ్యంగా జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, దీర్ఘకాలిక ఒత్తిడి, ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వంటివి అధిక రక్తపోటుకు దోహదం చేస్తాయి. రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోవడం 17 నుంచి 30 శాతం వరకు కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. 2025 నాటికి సగటు జనాభా ఉప్పు వినియోగాన్ని 30 శాతం తగ్గించాల్సి ఉండగా, WHO చెబుతున్న అనేక విషయాలను మన దేశంలో ఇంకా పెద్దగా పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా, 2021లో దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ఒక అధ్యయనంలో ప్యాక్‌డ్ ఫుడ్స్‌లో ఉప్పు -పంచదార ఎక్కువగా ఉన్నాయని తేలింది.
బీపీ బారిన పడకుండా ఉండాలంటే..
కార్పొరేట్ కంపెనీలు విచక్షణారహితంగా ప్రచారం చేసే ఆహారాలు, పానీయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యకరమైన. ఆహారం తీసుకోవడం, ఉప్పు తగ్గించడంపై అవగాహన కల్పించాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు, దేశీయ పంటలు - ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని తినడం, తగినంత వ్యాయామం చేయడం వంటి జాగ్రత్తలతో ఈ రక్తపోటును తగ్గగించుకోవచ్చు. ఇది స్ట్రోకులు, గుండెపోటులు, మూత్రపిండాల వైఫల్యం, గుండె వైఫల్యం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ప్రేరేపిస్తుంది.ఇందులో చాలా అనారోగ్య సమస్యలు గురించి చివరిదాకా తెలియదు... అందుకే బీపీని సైలెంట్ కిల్లర్ అంటారు. వైద్య ప్రమాణాల ప్రకారం, రక్తపోటు మానిటర్ 140/90 కంటే ఎక్కువ రీడింగ్‌ను చూపిస్తే, దానిని ఎక్కువ బీపీగా చెప్పవచ్చు. అటువంటప్పుడు అసలు నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. లేకపోతె విపరీత పరిణామాలు ఎదురవుతాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఈ సైలెంట్ కిల్లర్ విషయంలో జాగ్రత్తగా ఉండండి.
Watch this interesting Video:
గమనిక: ఈ ఆర్టికల్ వివిధ సందర్భాల్లో నిపుణులు వెలువరించిన అభిప్రాయాల ఆధారంగా.. వివిధ రిపోర్టుల నుంచి వచ్చిన సూచనలను తీసుకుని ఇవ్వడం జరిగింది. ఇది కేవలం పాఠకుల ప్రాధమిక అవగాహన కోసం ఇస్తున్న ఆర్టికల్ మాత్రమే. ఎటువంటి చికిత్సను ఈ ఆర్టికల్ సూచించడం లేదు. ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినపుడు డాక్టర్ ను సంప్రదించడం అవసరం అని సూచిస్తున్నాం.