వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోయిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు (GVL Narasimha Rao) తెలిపారు. స్టీల్ ప్లాంట్ ను ఎలా లాభాల బాట పట్టించాలో ఆలోచిస్తున్నామన్నారు. ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే నడపాలని చూస్తున్నామన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యలపై తాను నిత్యం పార్లమెంట్ లో మాట్లాడుతున్నానని తెలిపారు. ప్లాంట్ కు ముడి సరుకు ఇచ్చేందుకు NMDC సిద్ధంగా ఉందన్నారు జీవీఎల్. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో స్టీల్ ప్లాంట్ పెట్టినప్పుడు మైన్స్ ఎందుకు కేటాయించలేదని ఆయన ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ పరిస్థితిని బీజేపీ చక్కదిద్దుతుందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను గత యాజమాన్యాలు బ్రష్టు పట్టించాయన్నారు. రూ.2 వేల కోట్ల విలువైన వీల్స్ ప్లాంట్ ను RINL కు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ల్యాండ్ ఓనర్ షిప్ RINLకు లేదన్నారు.
ఇదిలా ఉంటే.. విశాఖ ప్రజలకు సైతం ఎంపీ జీవీఎల్ శుభవార్త చెప్పారు. విశాఖ నుంచి వారణాసికి ఎక్స్ప్రెస్ రైలును నడపనున్నట్లు ప్రకటించారు. చాలా సందర్బాల్లో రైల్వే మంత్రిని కలిసి వారణాసికి రైలును ఏర్పాటు చేయాలని కోరినట్లు జీవీఎల్ వివరించారు. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు నుంచి వారణాసికి ఎక్స్ప్రెస్ రైలు నడిపేందుకు ఆమోదం లభించిందని వెల్లడించారు. వారానికి రెండు రోజులు రైలును నడిపేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు జీవీఎల్.
రానున్న రోజుల్లో దీన్ని రోజువారీ రైలుగా నడిపే అవకాశం ఉందని వెల్లడించారు. విజయదశమిలోపు ఈ ట్రైన్ ను ప్రారంభించాలని కోరానన్నారు. రైల్వే పెండింగ్ సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సాధించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో రైల్వే జోన్ కూడా ఉందని చెప్పారు. విశాఖ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని జీవీఎల్ వెల్లడించారు. ఇంకా కేంద్రం తాజాగా తీసుకువచ్చిన మహిళా బిల్లు పట్ల మహిళలు అందరూ చాలా ఆనందంగా ఉన్నారన్నారు జీవీఎల్.