లోక్ సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మెహతాబ్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ మేరకు ఆయనతో కొద్ది సేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం కొత్త లోక్ సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక ఉంటుంది.
ఇక.. భర్తృహరి మెహతాబ్ విషయానికి వస్తే.. ఒడిశాకు చెందిన ఆయన వరుసగా కటక్ పార్లమెంట్ నియోజకవర్గ నుంచి 7 సార్లు ఎంపీగా విజయం సాధించి రికార్డు సృష్టించారు. గతంలో ఆయన బీజేడీలో ఉండగా.. ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. ఈయన ఒడిశా మాజీ సీఎం దివంగత హరే కృష్ణ మహతాబ్ కుమారుడు.
ఇదిలా ఉంటే.. కొత్త లోక్ సభ స్పీకర్ ఎవరనే అంశంపై బీజేపీ ఇంకా నిర్ణయానికి రాలేదు. ఇతర ఎన్డీఏ పక్షాలకు ఈ పదవి ఇస్తారన్న ప్రచారం తొలుత సాగింది. అయితే.. ఇందుకు బీజేపీ సుముఖంగా లేదని తెలుస్తోంది. మరో ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.