అసెంబ్లీ ఎన్నికలు (Telangana Elections 2023) సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దూకుడు పెంచుతున్నారు. ఏపీలో దశల వారిగా వారాహి యాత్ర చేస్తూ.. వైసీపీ సర్కార్‌పై (YCP Government) విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. ఇప్పుడు ఐదో విడత వారాహీ యాత్రకు సిద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్ అటూ ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా తమ పార్టీ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని జనసేన (Janasena) తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యాలయంలో పవన్.. జనసేన నాయకులతో భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయాల్సిందేనని జనసేన తెలంగాణ నాయకులు పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. 2018లో రాజకీయ గందరగోళానికి తావివ్వకూడదనే ఉద్దేశంతో పోటీ చేయరాదన్న అధ్యక్షుని అభిప్రాయాన్ని గౌరవించి పోటీ చేసేందుకు పట్టుబట్టలేమని.. అలాగే మిత్రపక్షమైన బీజేపీ విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా పోటీ నుంచి విరమించుకున్నామని.. ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం తప్పనిసరిగా పోటీచేయాల్సిందేనని ముక్త కంఠంతో కోరారు.
నేతల అభిప్రాయాలను విన్న పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అర్ధం చేసుకోగలని, తన మీద ఒత్తిడి ఉన్న మాట నిజమేనని.. అయితే నాయకులు, జన సైనికులు, వీర మహిళల అభిప్రాయాలను గౌరవిస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. సరైన నిర్ణయం తీసుకునేందుకు ఒకటి రెండు రోజుల సమయం అవసరవుతందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే.. తాజాగా పవన్ కళ్యాణ్‌తో బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌తో భేటీ అయ్యారు. ఇందులో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా పవన్‌ను కోరారు. అయితే పవన్ కళ్యాణ్ 2014లో ఏపీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ గెలుపుకోసం కృషి చేశామని.. అలాగే హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ నుంచి విరమించుకున్నామని.. ఇప్పుడు కనీసం 30 స్థానాల్లో అయినా పోటీ చేయకపోతే కార్యకర్తల స్థైర్యం దెబబ్ తింటుదని తెలంగాణ జనసేన నాయకులు చెప్పిన విషయాల్ని పవన్.. కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌లకు వివరించారు.
అయితే ఉమ్మడిగా పోటీ చేసే విషయంపై పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని పవన్ వారితో చెప్పారు. అయితే జనసేన పార్టీ తెలంగాణలో బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకుంటుందా అనే విషయం మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ, టీపీడీ, జనసేన కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం నడుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇటీవలే తాము టీడీపీతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన.. ఏకపక్షంగా టీడీపీతో కలిసినడుస్తామని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.