ఓ పక్క అంతర్గత విభేదాలు.. మరో పక్క వ్యూహాలు
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ ప్రజల్ని తమ వైపు తిప్పుకునేందుకు నాయకులు వ్యూహాలు మొదలు పెట్టారు. కానీ కొన్నిపార్టీల్లో మాత్రం అంతర్గత విభేదాలు బయటపడుతూ పార్టీలకు నష్టాన్ని చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీల అధిష్ఠానం వీటిపై దృష్టి పెట్టాయి. తాజాగా బీజేపీలో ఈటల, రాజగోపాల్ రెడ్డి అసంతృప్త గళం వినిపిస్తున్నట్లు తెలుసుకున్న హైకమాండ్ వారిని ఢిల్లీకి పిలిచింది. అమిత్ షా, జేపీ నడ్డా.. వీరిద్దరితో భేటీ అయి సర్దిజెప్పే ప్రయత్నం చేయనున్నట్లు సమాచారం. మరోవైపు కిషన్‌రెడ్డిని కూడా ఢిల్లీకి రమ్మని పిలుపు రావడంతో ఆయన కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు
ఆ ఫలితాలతోనే... దూకుడు
కర్ణాటక ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ పార్టీ అధిష్ఠానం దృష్టి తెలంగాణ ఎన్నికల వైపు మళ్లింది. బీజేపీపై నమ్మకంతో అధికార పార్టీ నేతలు పార్టీని వీడి బీజేపీ గూటికి చేరారు. కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి కూడా పార్టీ మార్చారు. బీజేపీ పార్టీని వీడిన తర్వాత అధికార బీఆర్ఎస్ పార్టీపై, కాంగ్రెస్‌పై విమర్శల వర్షం గుప్పించారు.
పార్టీని మార్చిన మొదట్లో బీజేపీలో జోష్‌గానే తిరిగిన నాయకులు ఇప్పుడు కొంత మౌనం పాటిస్తున్నారు. అంతేకాకుండా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికలవేళ ఈ అసంతృప్త గళం మంచిది కాదని భావిస్తున్న బీజేపీ హైకమాండ్ వెంటనే రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలోనే అసంతృప్తిని దూరం చేసే పనిలో పడింది. ఎన్నికల సమయంలో నేతల సమన్వయం లోపం పార్టీకి నష్టాన్ని కలిగిస్తుందని భావిస్తున్న బీజేపీ లోపాన్ని సరిదిద్దే పనిలో బిజీ అయింది.
సెట్ చేసే పనిలో కాషాయ..
తెలంగాణ బీజేపీలో నెలకొన్న అసంతృప్తిపై పార్టీ అధిష్ఠానం దృష్టిపెట్టింది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకుండా ఉంటున్న ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఢిల్లీ రావాల్సిందిగా ఆదేశించారు. ఈ ఇద్దరు నేతలతో... బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, జేపీ నడ్డా చర్చలు జరుపుతారని తెలుస్తోంది. ఈటల రాజేందర్, రాజగోపాల్‌రెడ్డి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముంగిట నేతల మధ్య సమన్వయ లోపం వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని గుర్తించిన అధిష్ఠానం... అసంతృప్తి చల్లార్చే అంశంపై దృష్టి పెట్టింది. ఈటల రాజేందర్, రాజగోపాల్‌రెడ్డితో చర్చించేందుకు సిద్దమైంది.
హుటాహుటి ఢిల్లీకి
తెలంగాణ బీజేపీ పార్టీలో అంతర్గత వ్యవహారాలు చక్కదిద్దిన తర్వాతే రాష్ట్రంలో పర్యటించాలని అగ్రనేతలు భావిస్తున్నారు. మరోవైపు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కూడా ఢిల్లీకి రమ్మని పిలవడంతో ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ నగరంలో తాను పాల్గొనాల్సిన కార్యక్రమాలను కిషన్ రెడ్డి రద్దు చేసుకున్నారు. అమిత్ షా, జేపీ నడ్డాలతో ఈటల, రాజగోపాల్ రెడ్డి భేటీలో కిషన్‌రెడ్డి కూడా పాల్గొననున్నట్లు సమాచారం.