Telangana BJP: తెలంగాణలోని ఇద్దరు ముఖ్యనేతలకు కేంద్ర మంత్రి పదవులు దక్కనున్నాయి. దేశంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది బీజేపీ. కాగా తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఈటల రాజేందర్, డీకే అరుణకు కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా 2019లో తెలంగాణకు నుంచి ఒకరికే కేంద్ర మంత్రి పదవి దక్కింది. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పర్యాటక శాఖ మంత్రిత్వ శాఖ పదవి పొందారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో అంత హవా చూపని బీజేపీ ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లోమొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు గాను 8 స్దానలను కైవసం చేసుకుంది.
మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓటమి చెందిన ఈటల రాజేందర్ కు పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ హైకమాండ్. మల్కాజ్ గిరి నుంచి బరిలో దిగిన ఈటల రాజేందర్ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న డీకే అరుణ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కాగా వీరి ఇద్దరికీ కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.