Nitish Kumar: కేంద్ర బడ్జెట్ 2024-25లో బీహార్‌కు ప్రత్యేక హోదా (Bihar Special Status) దక్కకపోవడంతో ఆ రాష్ట్ర విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేసి తమ అక్కసును వెళ్లగక్కారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రసంగిస్తున్న సమయంలో ఆందోళన చేపట్టారు. ‘సీఎం డౌన్ డౌన్.. ’’ అంటూ నినాదాలు చేశారు. విపక్ష ఆర్జేడీ (RJD MLA), కాంగ్రెస్ సభ్యుల నినాదాలతో నితీశ్ కుమార్ తీవ్ర ఆగ్రహానికి, అసహనానికి గురయ్యారు.
ఒక మహిళా ఎమ్మెల్యేపై ఆయన తన ప్రతాపాన్ని చూపించారు. ‘‘నువ్వొక మహిళవు. నీకేమైనా తెలుసా? చూడండి ఈమె మాట్లాడుతోంది. మహిళల కోసం మీరు (విపక్ష) ఏమైనా చేశారా?. సభలో మేం మాట్లాడుతాం. వినకపోతే అది మీ తప్పు’’ అంటూ కోపంతో ఊగిపోయారు.
సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యలపై విపక్ష నేత, ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) మండిపడ్డారు. మహిళలపై వ్యాఖ్యలు చేసే విషయంలో ఆయన తన నేరప్రవృత్తిని ప్రదర్శిస్తుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన దిగజారుడు వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యలు అవాంఛనీయం, అనాగరికం, అసభ్యకరం, నీచమైనవని ఆయన విమర్శించారు. స్త్రీలను అగౌరవపరిచే వ్యాఖ్యలు చేయడం ఆయనకు అలవాటుగా మారిందని తేజస్వి యాదవ్ అన్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం గిరిజన వర్గానికి చెందిన బీజేపీ మహిళా ఎమ్మెల్యే అందంపై నితీశ్ కుమార్ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని తేజస్వి యాదవ్ గుర్తు చేశారు.
Also Read: ముగ్గురిని హత్య చేసిన సాఫ్ట్‌వేర్!