బీజేపీకి (BJP) రాజీనామా చేస్తున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) ప్రకటించారు. ఈ మేరకు ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే తను కాంగ్రెస్ లో (Congress) చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే బీజేపీకి రాజీనామా చేస్తున్నానన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ద్వారా తనకు నియంతృత్వ కేసీఆర్ సర్కారుపై యుద్ధం చేసే అవకాశం కల్పించిన బీజేపీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కెసిఆర్ సర్కారుపై యుద్ధం చేయడానికి ప్రోత్సహించిన కేంద్ర మంత్రి అమిత్ షాకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. తెలంగాణ ప్రజల ఆలోచనల మేరకు పార్టీ మారాలని తాను తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ పెద్దలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని పత్రికా ప్రకటనలో తెలిపారు రాజగోపాల్ రెడ్డి.
ఇది కూడా చదవండి: TS Politics: బీఆర్ఎస్ గూటికి మరో కీలక నేత.. ఆ పదవి ఇస్తామని హామీ?
కేసీఆర్ కుటుంబ దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే తన ఆశయం మరో ఐదు వారాల్లో నెరవేరుతోందన్నారు రాజగోపాల్ రెడ్డి. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు స్పష్టమవుతోందన్నారు. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన బీజేపీ, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా కొంత డీలా పడిందన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను భావిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే తాను కూడా తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.
అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగలేక పోవడంతో ఆ స్థానంలోకి కాంగ్రెస్ వచ్చిందన్నారు. సకల జనుల పోరాటంతో సాకారమైన ప్రత్యేక తెలంగాణ పదేళ్ల కేసీఆర్ సర్కారు అరాచక పాలనతో గాడి తప్పిందన్నారు. అధికార మార్పును కోరుకుంటున్న తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే తాను కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.