లోహిత్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెనుప్రమాదం
ఒడిశా రైలు ఘటన మర్వకముందే మరో ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రమాదంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఎన్నో కుటుంబాలను విషాదఛాయలో ముంచింది. తాజాగా బీహార్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. గువాహటి నుంచి జమ్మూకు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి కొన్ని బోగీలు అకస్మాత్తుగా విడిపోయాయి. తరచూ రైలు ప్రమాదాలు జరుగుతూ ఉండటంతో ప్రయాణికుల్లో ఆందోళన ఎక్కువైంది.
ఇంజిన్ లేకుండానే ప్రయాణించిన కోచ్‌లు
బిహార్‌లో మరో రైలు ప్రమాదం త్రుటిలో తప్పింది. ఓ రైలు రెండుగా విడిపోయి.. ఇంజిన్ లేకుండానే కోచ్‌లు చాలా దూరం అలాగే ప్రయాణించాయి.ఈ ఘటన కటిహార్ జిల్లాలో చోటుచేసుకుంది. అసోంలోని గువాహటి నుంచి జమ్మూకు వెళ్లే లోహిత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఒక్కసారిగా రెండు భాగాలుగా విడిపోయింది. ఇంజిను నుంచి దాదాపు 10 బోగీలు విడిపోగా.. మిగతా కోచ్‌లతో రైలు మాత్రం కొంతదూరం అలాగే ముందుకెళ్లింది. బిహార్ - బెంగాల్ సరిహద్దులోని నార్త్ దినాజ్‌పుర్ సమీపంలో కటిహార్ రైల్వే డివిజన్ పరిధిలో ఉన్న దల్ఖోలా-సూర్యకమాల్ స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది.
విడిపోయిన బోగీలు.. అందరూ క్షేమం
బోగీలను వదిలి రైలు ఇంజిన్ అలాగే ముందుకెళ్లడంతో ప్రయాణికులు భయపడిపోయారు. చాలా మంది ప్రాణభయంతో కిందికి దూకేశారు. అయితే, అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. లేదంటే మరో బాలాసోర్ ప్రమాదంగా మారేంది. అదే సమయంలో ఎదురుగా ఏ రైలు రాకపోవడం కూడా కలిసొచ్చింది. ఇక, ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను కాసేపు నిలిపివేసిన అధికారులు.. ఇంజిన్‌తో కోచ్‌లను అనుసంధానం చేశారు. కొద్ది గంటల ఆలస్యంగా రైలు అక్కడ నుంచి మళ్లీ కదిలింది. రైలులో వంద మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు.
పరిస్థితిని చక్కదిద్దారు..
కొద్ది దూరం వెళ్లిన తర్వాత కోచ్‌లు ఇంజిన్ నుంచి విడిపోయినట్టు గమనించిన లోకోపైలట్ .. వెంటనే బ్రేక్‌లు వేసి నిలిపివేశాడు. అనంతరం ఈ విషయాన్ని కటిహార్ కంట్రోల్ రూమ్‌కు తెలియజేశాడు. దీంతో అక్కడ సిబ్బంది అప్రమత్తమై ఆ మార్గంలో రైళ్లు రాకుండా చర్యలు తీసుకున్నారు. అనంతరం కోచ్‌లను ఇంజిన్‌తో కలిపారు.