Bhatti Vikramarka: యాదాద్రి లక్ష్మీనరసింహున్ని (Yadadri Temple) సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు దర్శించుకున్న సందర్భంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందన్న కథనాలపై ఆయన స్పందించారు. ఆ సమయంలో అక్కడ ఏం జరిగిందో వివరించారు. దీని గురించి సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై డిప్యూటీ సీఎం ఫైర్ అయ్యారు. తాను కావాలనే చిన్నపీట మీద కూర్చున్నట్లు తెలిపారు భట్టి.
బంజారాహిల్స్ లో నిర్వహించిన సింగరేణి అతిథిగృహ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదాద్రిఘటనపై వివరణ ఇచ్చారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో భాగంగా పేదలకు ఇందిరమ్మ ఇళ్ల స్కీం (Indiramma houses Scheme) విజయవంతం కావాలని యాదాద్రి నరసింహున్ని కోరికున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగానే తాను కావాలనే చిన్న పీట మీద కూర్చున్నట్లు చెప్పారు. డిప్యూటీ సీఎంగా (Deputy CM) తెలంగాణ రాష్ట్రాన్ని శాసిస్తున్నా..మూడు శాఖలతో ప్రభుత్వంతో ముఖ్యపాత్రను పోషిస్తున్నాని తెలిపారు. ఆత్మ గౌరవంతో జీవించే మనిషిని తాను అని..తనను ఎవరూ అవమానించలేదన్నారు. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నా అంటూ భట్టి విక్రమార్క తెలిపారు.
ఇది కూడా చదవండి: కీసర ఏఈ రాహుల్ అరెస్ట్.. దుబాయ్ చెక్కేసేందుకు పట్టుకున్న పోలీసులు!
కాగా అటు సీఎం రేవంత్ (CM Revanth Reddy) యాదాద్రి ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టిగారిని, మంత్రి కొండ సురేఖను అవమానించారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఎత్తైన పీటలమీద కూర్చొని భట్టిని తక్కువ ఎత్తులో కూర్చోబెట్టడం చాలా దౌర్భాగ్యం అన్నారు. సీఎం రేవంత్ వెంటనే భట్టితోపాటు తెలంగాణ ప్రజానికానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
చాలా ఓపిక పట్టినం..
ఈ మేరకు కవిత మాట్లాడుతూ.. గతంలో అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని స్పీకర్ కు వినతిపత్రం ఇస్తే ఆనాడు కూడా దళితుడుకి వినతిపత్రం ఇచ్చారంటూ రేవంత్ అవమానించారని గుర్తు చేస్తూ తనదైన స్టైల్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అప్పుడు ఓపిక పట్టినం. ఇవాళ సాక్షాత్తు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా దళితుడు అయిన భట్టిని రేవంత్ అవమానించారు. రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలి. మహిళకు 47 శాతం రిజర్వేషన్లతో ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ అబద్ధాలు చెప్పారు. గురుకులాల్లో 85 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఆనాడు కేసీఆర్ గారు జీఓ ఇచ్చారు. దాన్ని కాంగ్రెస్ వాళ్లు తీసేసారు. సీఎం చెప్పేవాన్ని అన్ని అబద్ధాలే. యువతను మభ్యపెట్టాలని చూస్తున్నారు. విద్యార్థులను మోసం చేయొద్దు. బీసీ లకు మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా రిజర్వేషన్లు అమలు చేయాలి. అందుకే రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నాం. కులగణన విషయంలో కాలయాపన చేయొద్దు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికలకంటే ముందే 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి’ అంటూ కవిత చెప్పుకొచ్చారు.