Bhajan Lal Sharma: తొలి విజయంతోనే సీఎం.. భజన్‎లాల్ కెరీర్‎లో ఆసక్తికర విశేషాలు

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అధిష్టానం ఖరారు చేసిన భజన్‎లాల్ శర్మ విద్యార్థి నేత నుంచి క్రమంగా ఎదిగారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయనకు ఉంది. రాష్ట్రంలో ఎక్కువ కాలం పార్టీ ప్రధానకార్యదర్శిగా సేవలందించారు. ఆర్ఎస్ఎస్ లో క్రియాశీలకంగా వ్యవహరించారు.

New Update
Bhajan Lal Sharma: తొలి విజయంతోనే సీఎం.. భజన్‎లాల్ కెరీర్‎లో ఆసక్తికర విశేషాలు

Bhajan Lal Sharma: కొత్త ముఖ్యమంత్రుల ఎంపికలో బీజేపీ (BJP) భిన్నమైన ధోరణితో ముందుకెళ్తోంది. కొత్త వ్యక్తులకు పట్టం కట్టడంతో పాటు ఎప్పట్లానే సంఘ్ నేపథ్యంపై తన ప్రాధాన్యాన్ని నొక్కిచెప్తోంది. చివరివరకూ ఉత్కంఠ రేపిన రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎంపికలోనూ ఇదే జరిగింది. చివరికి ఆశ్చర్యకరంగా తొలిసారి గెలిచిన ఎమ్మెల్యే భజన్ లాల్ శర్మను (Bhajan Lal Sharma) అన్నివిధాలా ‘అర్హుడ’ని భావించి అధిష్టానం రాజస్థాన్ (Rajasthan) సీఎం పీఠంపై కూర్చోబెట్టి సస్పెన్స్ కు తెరదించింది. జైపూర్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించారు.

ఇది కూడా చదవండి: రాజస్థాన్ కొత్త సీఎంగా భజన్‌లాల్‌ శర్మ.. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేకు లక్కీ ఛాన్స్!

భజన్‎లాల్ నేపథ్యమిదీ..
సంఘ్ నేపథ్యమే భజన్‎లాల్ బలం. క్రమశిక్షణ గల స్వయంసేవకుడిగా పేరున్న ఆయన ఈ ఎన్నికల్లోనే జైపూర్‌లోని (Jaipur) సంగనేర్ అసెంబ్లీ స్థానం నుంచి మొదటిసారి గెలుపొందారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 48 వేల ఓట్ల మెజార్టీ సాధించారు. ఆర్ఎస్ఎస్ (RSS) తో పాటు బీజేపీలోనూ పలు కీలక స్థానాల్లో ఆయన క్రియాశీలకంగా పనిచేశారు. నాలుగు సార్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. మొదట ఆయన భరత్‌పూర్‌ నుంచి టిక్కెట్ ఆశించినప్పటికీ, పలు సమీకరణాల నేపథ్యంలో సంగనేరు నుంచి ఎన్నికల బరిలో దిగారు. శాసనసభా పక్ష సమావేశంలో ముఖ్యమంత్రిగా భజన్‌లాల్ శర్మ పేరును స్వయంగా వసుంధరా రాజే ప్రతిపాదించడం విశేషం.

విద్యార్థి నేత నుంచి ముఖ్యమంత్రి దాకా...
భజన్ లాల్ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. ఏబీవీపీలో కీలక నేతగా ఎదిగారు. విద్యార్థి సమస్యలపై ఆయన కార్యాచరణ అందరి దృష్టినీ ఆకర్షించింది. క్రమంగా ఆర్ఎస్ఎస్ లో కీలక స్థానానికి చేరారు. అక్కడి నుంచి బీజేపీలో చేరి పార్టీ పటిష్టత కోసం విశేషంగా కృషిచేశారు. అందరినీ కలుపుకునిపోయే నాయకుడిగా గుర్తింపు పొందారు. సుదీర్ఘకాలం రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు వివిధ హోదాల్లో పార్టీ బలోపేతానికి తోడ్పాటునందించారు. ఈ ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న ఆయనను అధిష్టానం ముఖ్యమంత్రిగా ప్రకటించింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు