Bangalore: సరిగ్గా ఇదే తేదీ.. రెండేళ్ల క్రితం.. హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్లే రైలు రయ్యిన దోసుకుపోతోంది.. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? పక్కనున్నాయన్ని అడిగాడు ఓ పెద్దమనిషి. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గర్వంగా చెప్పాడు ఆయన. రైలన్నాకా పిచ్చాపాటీ మామూలే కదా. అలా చాలా సేపటి నుంచి ఆ ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఓహో.. అయితే ఇంకేమండీ బాబూ.. మీరు హాయిగా కాలుమీద కాలేసుకుని కూచోవచ్చు. కొంచెం అసూయ వద్దనుకున్నా కనిపిస్తుంది ఆ పెద్దమనిషి కళ్ళలో. అవును.. ఈ ఏడాది పెళ్లి చేసేస్తున్నాం. అమ్మాయి కోసం వెతుకుతున్నాం.. ఈసారి అడక్కుండానే చెప్పాడాయన. అవునా? మా మేనకోడలు ఉందండీ. అదీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. హైదరాబాద్ లో చేస్తోంది. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి వివరాలు పంపిస్తాను గబగబా అడిగేశాడు ఆ పెద్దాయన.. భలే ఛాన్స్ వదిలేస్తే పోతుందేమో అన్నంత కంగారు ఆయన మాటల్లో… కట్ చేస్తే..
ప్రస్తుతం.. వందేభారత్ రైలు బెంగుళూరు ఆఘమేఘాల మీద పరిగెడుతోంది. అప్పుడే వచ్చిన స్నాక్స్ తింటూ ఇద్దరమ్మాయిలు మాట్లాడుకుంటున్నారు. నేను బెంగళూరు వదిలేద్దామని అనుకుంటున్నాను. అందుకే హైదరాబాద్ ఇంటర్వ్యూ ఉంటె వచ్చాను చెప్పింది వారిలో ఒకమ్మాయి. నిజమే.. నేను కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతున్నాను. ఇల్లు చూడటం కోసమే వచ్చాను. యాక్టువల్ గా బెంగళూరు(Bangalore)లో ఫ్లాట్ కూడా కొన్నాను కానీ, అది అమ్మేద్దామని అనుకుంటున్నా అంది రెండో అమ్మాయి. ఏం ఎందుకు? మొదటి అమ్మాయి ఆసక్తిగా అడిగింది.. ముందు బెంగళూరులోనే సెటిల్ అవుదామని అనుకున్నా.. అక్కడే సంబంధం కూడా చూశారు. కానీ, వద్దనుకున్నాం. హైదరాబాద్ లోనే సెటిల్ అవుదామని డిసైడ్ అయిపోయాను చెప్పింది. అవునా.. నాకు లానే మీరూ అనుకుంటా అంది మొదటమ్మాయి.. సరే ఇలా చెప్పుకుంటూ పొతే బెంగళూరు వచ్చేస్తుంది.. కానీ.. విషయంలోకి వెళ్ళిపోదాం..
Also Read: కింగ్ కోబ్రాతో కోతి సరసాలు.. ఇంటర్నెట్ ను షేక్ చేసిన వీడియో!
రెండేళ్లలో ఎంత మార్పు చూశారా? అప్పుడు బెంగళూరులో ఉద్యోగం అనగానే పిల్లని ఇవ్వడానికి తొందరపడిపోయాడు పెద్దాయన. ఇప్పుడు బెంగళూరు(Bangalore)లో ఉద్యోగం వద్దు.. పెళ్ళీ వద్దు అంటున్నారు అమ్మాయిలు. ఎందుకో తెలుసా? ప్రస్తుతం అక్కడ తాగడానికి గుక్కెడు నీరు కావాలన్నా.. ఎవరూ ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకా చెప్పాలంటే అపార్ట్మెంట్స్ లో ఉంటున్నవారిని టాయిలెట్స్ కి దగ్గరలో ఉన్న మాల్స్ కి వెళ్లి వచ్చేయండి అని అసోసియేషన్స్ అడుగుతున్న పరిస్థితి ఉంది. దీంతో బెంగళూరు వద్దు హైదరాబాదే ముద్దు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.
అవును బెంగళూరులో వర్షాలు కురవకపోవడంతో భూగర్భజలాలు పడిపోయాయి. దీంతో 3,000 బోర్‌వెల్‌లు ఎండిపోయాయి. ఫలితంగా నగరంలో నీటి కొరత ఏర్పడింది. నగరంలో ఈ నీటి సంక్షోభం పెద్ద అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, అగ్నిమాపక దళం, హోటళ్లు, రెస్టారెంట్లపై ప్రభావం చూపింది. నీటి సరఫరాకు, డిమాండ్‌కు మధ్య తీవ్ర అంతరం ఉండడంతో నగరవాసులు నీటి కొరత(Bangalore Water Crisis)తో అవస్థలు పడుతున్నారు. అటువంటి పరిస్థితిలో, బెంగళూరులో ఉంటున్న ఒకాయన బెంగళూరు నీటి కొరత సంక్షోభం కారణంగా తన ఐటి స్నేహితుడికి పెళ్లి కావడం లేదని.. అలాంటి నగరంలో పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి సిద్ధం కావడం లేదనీ వాపోతూ Xలో పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు అది వైరల్ అయింది. బెంగళూరు పరిస్థితిని ప్రపంచానికి అర్ధం అయ్యేలా చేసింది. X లో తాజాగా వైరల్ అయినా ఈ పోస్ట్‌లో, BCA అనే పేజీలో, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఇలా ఒకాయన అభ్యర్థించారు. “నా స్నేహితుల్లో ఒకరు బెంగళూరులోని ఐటీ పరిశ్రమలో పని చేస్తున్న తన ప్రస్తుత అనుభవాన్ని పంచుకున్నారు. అతను పెళ్లి కోసం చూస్తున్నాడు, కాని నీటి సంక్షోభం కారణంగా బెంగళూరు ఉద్యోగిని పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ఎవరూ సిద్ధంగా లేరు” అని ట్వీట్ చేశారు. ఈ సమస్యకు హై ప్రియారిటీతో పరిష్కారం కనుగొనాలని ఆయన కాంగ్రెస్‌ను కోరారు. ఇక అక్కడ టెక్కీలు నీటి సమస్యలు పరిష్కారం అయ్యేవరకూ వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) కోసం అడుగుతున్నారు. నీటి విషయంలో బెంగళూరుపై ఒత్తిడిని తగ్గించడానికి ఇది సహాయపడుతుందని వారు భావిస్తున్నారు.
అదండీ విషయం.. చాలా ఏళ్ల క్రితం ఇప్పటి చెన్నై.. అప్పటి మద్రాస్ నగరంలో ఇలాంటి పరిస్థితే వచ్చింది. అప్పుడు ఏపీ నుంచి గూడ్స్ రైలు ట్యాంకులతో నీళ్లు పంపించారు. అప్పుడే ఎన్టీఆర్ తెలుగుగంగ పథకాన్ని తీసుకువచ్చారు. దాదాపుగా ఇప్పుడు బెంగళూరు పరిస్థితి కూడా అలానే ఉంది. సరదాగా చెప్పుకున్నా విషయం అయితే నీటి ఎద్దడితో బెంగళూరు కటకటలాడిపోతోంది.
ఇదిగో ఇక్కడ ఆ ట్వీట్ మీరూ చూసేయండి: