మాటలను సీరియస్‌గా తీసుకోలేము
బండి సంజయ్.. కేఏ పాల్ లాగే మాట్లాడుతున్నారని, ఆయనపై సానుభూతి వ్యక్త పరచడం తప్ప బండి సంజయ్ మాటలను సీరియస్‌గా తీసుకోలేమని రేవంత్ అన్నారు. దశాబ్ది దగా నిరసనలు తెలువుతున్న కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడం దుర్మార్గమని, పోలీసులతో సీఎం కేసీఆర్ రాజ్యాన్ని నడపాలనుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. హజ్ యాత్రికులను పంపడానికి వెళ్తున్న షబ్బీర్ అలీని గృహ నిర్బంధం చేయడం దుర్మార్గమన్నారు. అమరుల బలిదానాలను కేసీఆర్ అవమానిస్తున్నారని అన్నారు. ఇంత ఖర్చు చేసి కట్టిన స్మారకంలో కేవలం అమరవీరులకు జోహార్లు అని రాసి సరిపెట్టారని, శిలాఫలకంపై అమరుల పేర్లు పెట్టనప్పుడు రాష్ట్రంలో శిలాఫలకాలపై సీఎం కేసీఆర్ పెరు ఎందుకు పెట్టాలని ప్రశ్నించారు.
నాణ్యతాలోపం ఉంది
రూ. 63 కోట్లతో మొదలైన అమరుల స్మారకం అంచనా 179 కోట్ల 5లక్షలకు చేరిందని రేవంత్‌రెడ్డి అన్నారు. దీనిపై నిలదీయాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు ఉందన్నారు. అమరుల స్మారకం అంటే తెలంగాణ అమరుల చరిత్ర కళ్లముందు మెదిలేలా ఉండాలని, ఒక శ్రీకాంతాచారి, ఇషాన్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య… వందలాది మంది అమరులు గుర్తొచ్చేలా ఉండాలన్నారు. పవిత్రమైన అమరుల స్మారకాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఇచ్చి అపవిత్రం చేశారని విమర్శించారు. అమరుల స్మారక నిర్మాణంలో నాణ్యతాలోపం ఉందని, ఎలివేషన్‌లో ఉపయోగించింది స్టెయిన్ లెస్ స్టీల్.. 4ఎంఎం పలుచని స్టెయిన్ లెస్ స్టీల్ వాడారన్నారు. నగరం నడిబొడ్డున అమరుల స్మారకంలో వాడిన స్టెయిన్ లెస్ స్టీల్ 8ఎంఎం అంచనా వేసి 4ఎంఎం వాడారని, ఈ మొత్తం అవినీతికి కారణం కేటీఆర్, ఆయన స్నేహితుడు శ్రీధర్ అని రేవంత్ అన్నారు.
అమరుల కుటుంబాలకు రూ.25 వేలు పెన్షన్
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 1569 మంది అమరుల పేర్లు శిలాశాసనంలో పొందుపరుస్తామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేసిన అమరుల కుటుంబాలను గుర్తించి రూ.25 వేలు నెలకు పెన్షన్ అందిస్తామని స్పష్టం చేశారు. డిసెంబర్ 9న 1569 మంది కుటుంబాలను పిలిచి సోనియా గాంధీ కుటుంబ సభ్యులతో సహపంక్తి భోజనాలు చేయిస్తామని, తెలంగాణ సాధన సమరయోధులుగా వారికి గుర్తింపు అందిస్తామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.