Bandi Sanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ పార్టీలపై (Congress Party) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ (CM KCR) కుటుంబ ఆస్తులు జప్తు చేస్తామని తెలిపారు. కమిషన్ల పేరుతో దోచుకున్న సొమ్మునంతా వసూలు చేస్తామన్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిన విషయంపై వాస్తవ నివేదిక ఇచ్చిన కేంద్ర బృందంపై అవాకులు పేలుతున్న కేటీఆర్‌పై (KTR) ధ్వజమెత్తారు. ‘‘డేట్, టైం ఫిక్స్ చేయ్. ఇరిగేషన్ నిపుణులతో కలిసి మేడగడ్డకు వస్తా. మీ అయ్యను తీసుకురా.. మేం వాస్తవమని నిరూపిస్తా.. ప్రజలకు వాస్తవాలు బయటపెడదాం. మీ అయ్యను తీసుకొచ్చే దమ్ముందా?‘‘ అంటూ సవాల్ విసిరారు. ఎల్లుండి జరిగే ప్రధాని మోదీ సభకు భారీ ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్ధిగా నామినేషన్ వేస్తున్నట్లు తెలిపిన బండి సంజయ్ ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.
Also Read: అభివృద్ధిపై చర్చించే దమ్ముందా?.. కేటీఆర్‌కు షర్మిల సవాల్!
రేవంత్‌రెడ్డిపై బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కాంగ్రెస్‌లో రేవంత్ (Revanth Reddy) బలిపశువు కావడం తప్పదన్నారు బండి. ఢిల్లీలో ఇటీవల కొందరు ముస్లిం మతపెద్దలు రాహుల్ గాంధీని కలిసి మద్దతు ప్రకటించినట్లు తనకు తెలిసిందని బండి చెప్పారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డిని సీఎంగా చేయబోమని హామీ ఇస్తేనే తాము మద్దతు ఇస్తామని అన్నారని, దానికి రాహుల్ సరేనన్నట్లు నాకు తెలిసిందని బండి తెలిపారు. పాపం అంతోఇంతో కష్టపడుతున్న రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ మొండిచెయ్యి చూపిస్తుందని బండి అన్నారు. అంతేకాదు.. రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి పదవి దక్కదని తెలిసి కాంగ్రెస్‌లోని నేతలందరూ చంకలు గుద్దుకుంటున్నారని బీజేపీ నేత ఆరోపించారు. కాంగ్రెస్‌లో ప్రజల గురించి ఆలోచించే నాయకులు లేరు.. ఎవరికివారు సీఎం కావాలనే కొట్లాడుకుంటున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.
బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత మోదీదే
కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించిందన్నారు. పార్టీ ఆదేశం మేరకు తాను రేపు నామినేషన్ దాఖలు చేస్తున్నట్టుగా బండి తెలిపారు. బీసీలను సీఎం కేసీఆర్ అవమానిస్తున్నారన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధిని సీఎంగా ఎందుకు చేయరని కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు చెందిన బీసీ నేతలు ఆ పార్టీలను నిలదీయాలని సంజయ్ కోరారు. బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని తాము అంటే అందరూ తమను అవహేళన చేస్తున్నారు. కానీ బీసీల పట్ల నిబద్ధత కలిగిన పార్టీ బీజేపీ ఒక్కటేనని బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదేనన్నారు బండి సంజయ్.