తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఈ ఏడాదిలో జరగనున్న శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి మరోమారు ఆశీర్వదించాలని బీఆర్‌ఎస్ పార్టీ ప్రజానీకాన్ని కోరుతుండగా.. ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన ఎజెండాగా విపక్షాలు కార్యాచరణను వేగవంతం చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నాయి. తాజాగా బండి సంజయ్ కేటీఆర్, కేసీఆర్, రేవంత్‌రెడ్డిలను ఉద్దేశిస్తూ ఆరోపణలు గుప్పించారు.
అభివృద్ధిపై ఊసేలేదు..
రాజకీయాలు, పరిపాలన వేరు వేరు అన్న సంజయ్.. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి, నాయకుడు వెళ్లినా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అపాయింట్మెంట్ ఇస్తుందని తెలిపారు. అలాగే కేటీఆర్ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి చేసిన అభివృద్ధిపై కేసీఆర్ ఎప్పుడైనా.. ఎక్కడైనా మాట్లాడారా అని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. పార్టీ నేతలతో కలిసి శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్ర పటం వద్ద నివాళులార్పించారు బండి సంజయ్. తొమ్మిదేళ్లకే దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు.
కాంగ్రెస్ సీట్లను నిర్ణయించేది కేసీఆరేనా..!
ఎంతో మంది కాంగ్రెస్ నేతలు నన్ను కూడా కలిశారు. కేసీఆర్ చెప్తున్న అభివృద్ధిపై చర్చించేందుకు మేం సిద్ధం. ఏ అభివృద్ధి పనులకు కేంద్రం సహకరించటం లేదో కేసీఆర్ చెప్పాలి. ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరుకావాలని మహిళలను బెదిరిస్తున్నారు. ఏ పార్టీ పరిస్థితి ఏమిటో చూసే ప్రజలు ఓటు వేస్తున్నారు. మానసిక పరిస్థితి చూసే డిపాజిట్లు కూడా రాని ఓట్లు పడుతున్నాయి. బీజేపీ నుంచి ఎవరూ వెళ్లరు. మునిగిపోయే నావలో వెళ్లేవారిని మేం ఆపేది లేదు. తెలంగాణ కోసం 1400 మంది ఆత్మహత్య చేసుకుంటే 600 మందినే గుర్తించారు.’-బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
డిపాజిట్ లేని మీరే చెప్పాలా…
అదేవిధంగా బండి సంజయ్ మానసిక స్థితి బాగులేదని ఇటీవల రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఎవరి మానసిక స్థితి ఏంటో ప్రజలకు తెలుసు అన్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌లో డిపాజిట్లు కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మానసిక పరిస్థితి చూసే ప్రజలు అక్కడ ఓట్లు వేయలేదని విమర్శించారు. మునిగిపోయే నావలోకి వెళ్తామంటే తాము ఆపమన్న బండి సంజయ్.. బీజేపీ నుంచి ఎవ్వరూ బయటకు వెళ్లరని స్పష్టం చేశారు.