Medchal: మేడ్చల్ జిల్లా చెంగిచర్ల ప్రాంతంలో ఎస్టీ సామాజికవర్గ మహిళలపై దాడిని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా? ఎమర్జెన్సీ సమయంలో ఇందిరమ్మ రాజ్యాన్ని చవి చూపిస్తున్నారా? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో రాజకార్ల అరాచకాలను చూపించారని, ఇప్పుడు కాంగ్రెస్ ఎమర్జెన్సీ టైంలో ఇందిరమ్మ పాలనను చూపించాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
ఇంగిత జానం లేదా..
ఈ మేరకు సోమవారం సాయంత్రం కరీంనగర్ లో బండి సంజయ్ చెంగిచర్ల ఘటనను ఖండిస్తూ మీడియాకు వీడియోను విడుదల చేశారు. హోలీ పండుగలో భాగంగా హిందువులంతా కాముడిని దహనం చేయడం సంప్రదాయం. చంగిచర్లలో ఎస్టీ సామాజిక ప్రజలు కాముడి దహన కార్యక్రమంలో భాగస్వాములై భక్తిపాటలతో నిమగ్నమైన సందర్భంగా ఒక వర్గానికి చెందిన కొందరు గూండాలు దాడి చేయడం దుర్మార్గం. మహిళలనే ఇంగిత జానం లేకుండా నిర్లజ్జగా దాడి చేశారు. సౌండ్ బాక్సులను ధ్వంసం చేశారు. దాదాపు 5 వందల మంది గూండాలు మూకుమ్మడిగా దాడి చేయడం సిగ్గు చేటు. ఈ దాడిలో రూప అనే మహిళ తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. మరో మహిళ తీవ్రంగా గాయపడిందన్నారు.
వాళ్లపైనే లాఠీఛార్జ్ చేస్తారా?
అలాగే హిందువులపై దాడులు చేసిన వాళ్లను పోలీసులు వదిలేసి.. తిరిగి దాడులకు గురైన వాళ్లపైనే లాఠీఛార్జ్ చేస్తారా? అట్లా చేస్తేనే శాంతి భద్రతలు కంట్రోల్ అవుతాయనుకుంటున్నారా? అని పశ్నించారు. ఇది కరెక్ట్ కాదని, తాము చట్టాలను గౌరవించేవాళ్లమని చెప్పారు. మా ప్రశాంతతను అడ్డుకోవాలనుకుంటే తీవ్ర పరిణామాలుంటాయి. గతంలో కేసీఆర్ రజాకార్ల పాలనను చూపిస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎమర్జెన్సీ సమయంలో ఇందిరమ్మ రాజ్యం ఎట్లుందో ప్రజలకు చవి చూపించాలనుకుంటున్నారా? అసలు నేనడుగుతున్నా.. ఈ పండుగ చేసుకుంటే వాళ్లకు వచ్చిన ఇబ్బందేమిటి? పోలీసులెందుకు పట్టించుకోవడం లేదు. దాడి వాళ్లు చేస్తే.. వాళ్లపై చర్య తీసుకోకుండా మహిళలను కంట్రోల్ చేస్తారా? లాఠీ చార్జ్ చేసి గాయపరుస్తారా? అంటూ ఫైర్ అయ్యారు.
ముస్లింలకు అవకాశం ఇస్తారా?
రంజాన్ పర్వదినం సందర్భంగా విధులు నిర్వహించే ముస్లింలకు తొందరగా ఇంటికి వెళ్లే అవకాశాన్ని కల్పించారు. ఈ పండుగ సమయంలో గంట గంటకు నమాజ్ చేస్తూ సౌండ్ పెట్టుకుంటున్నారు? కానీ మేం అభ్యంతరం చెప్పలేదు. కానీ మా అయ్యప్ప స్వాముల దీక్షకు, భవానీ, అంజన్న, శివ మాల ధరించే భక్తులకు ఎలాంటి మినహాయింపు ఎందుకివ్వరు? ఈ విషయాన్ని ప్రస్తావిస్తే మాపై మాతతత్వ వాదులని ముద్ర వేస్తారా? పైగా కుహానా లౌకిక శక్తులు అరాచకాలు స్రుష్టిస్తుంటే ప్రభుత్వం, పోలీసులు ఏం చేస్తున్నారు. వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇది మంచి పద్దతి కాదన్నారు. అన్ని వర్గాలను సమానంగా చూడాలని కోరారు. ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. తాము ప్రశాంత వాతావరణం కోరుకుంటున్నామని, సహనాన్ని చేతకానిదిగా భావిస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. మహిళలపై దాడులు చేసినందుకు తీవ్ర పరిణామాలను ఎదుర్కొక తప్పదన్నారు. గుణపాఠం చెప్పేందుకు హిందూ సమాజం సిద్ధంగా ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పరిస్థితిని కోరుకుంటే బీఆర్ఎస్ ను ప్రజలు ఏ విధంగా బొంద పెట్టారో... కాంగ్రెస్ కు అదే గతి పడుతుందని హెచ్చరిస్తున్నామన్నారు. తక్షణమే చెంగిచర్ల ఘటనకు బాధ్యులైన దుండుగలపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.