China: సరిహద్దులో రెచ్చిపోతున్న డ్రాగన్‌ దేశం.. మారని దొంగ బుద్ధి

సరిహద్దులో చైనా రెచ్చిపోతోంది. ఓ వైపు చర్చలంటూనే మరోవైపు కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇటీవల శాటిలైట్‌ చిత్రాల్లో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. తాజాగా మరో దుర్మార్గానికి తెగబడింది డ్రాగన్‌ కంట్రీ. అరుణాచల్‌ప్రదేశ్‌, అక్సాయ్‌చిన్‌ మావేనంటూ కొత్త మ్యాప్‌లు రిలీజ్‌ చేసింది.

New Update
China: సరిహద్దులో రెచ్చిపోతున్న డ్రాగన్‌ దేశం.. మారని దొంగ బుద్ధి

మారని చైనా వక్ర బుద్ధి.. 

భారత భూభాగాలను తమవిగా చూపుతూ అధికారికంగా చైనా (China) కొత్త మ్యాప్‌ విడుదల చేసింది. 2023 ఏడాదిలో ఎడిషన్ పేరుతో ఈ కొత్త మ్యాప్ ను చైనా తన అధికారిక వెబ్ సైట్‌లో పొందుపరిచింది. భారత భూభాగాలతో పాటు తైవాన్‌ను, సౌత్ చైనా సముద్రాన్నీ మ్యాప్‌లో పొందుపరిచింది. ఈ వివరాలను డ్రాగన్ కంట్రీ అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ ట్వీట్లో వెల్లడించింది.1962లో జరిగిన యుద్ధంలో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని సగానికిపైగా భూభాగాన్ని ఆక్రమించింది చైనా. ఆ తర్వాత కాల్పుల విరమణ ప్రకటించి తన సైన్యాన్ని మెక్‌మోహన్‌ రేఖ నుంచి వెనక్కి రప్పించింది. అరుణాచల్‌ప్రదేశ్‌ (Arunachal Pradesh)ను దక్షిణ టిబెట్‌ ప్రాంతంగా వాదిస్తోన్న చైనా..టిబెట్‌ బౌద్ధ మత గురువు దలైలామా నుంచి భారత ప్రధాని వరకూ అరుణాచల్‌ను సందర్శించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉంది. తాజాగా మళ్లీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. నిన్న విడుదల చేసిన అధికారిక మ్యాపుల్లో అరుణాచల్‌ ప్రదేశ్‌, అక్సాయిచిన్‌ ప్రాంతాలను చైనా భూభాగాలుగా పేర్కొంది. చైనా సహజ వనరుల శాఖ ‘2023 ఎడిషన్‌ ఆఫ్‌ ద స్టాండర్డ్‌ మ్యాప్‌ ఆఫ్‌ చైనా’ (2023 Edition of the Standard Map of China)పేరుతో ఈ మ్యాపుల్ని రూపొందించింది.

అరుణాచల్ ప్రాంతంతో కొత్త మ్యాప్..

అరుణాచల్‌లోని ప్రాంతాలకు చైనా పేర్లు సూచిస్తూ డ్రాగన్ మ్యాపులు విడుదల చేయటం ఇది మూడోసారి. ఈ ఏడాది ఏప్రిల్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాల పేర్లను చైనీస్, టిబెటన్, పిన్‌యున్ భాషల్లో చైనా సివిల్ అఫైర్స్ మినిస్ట్రీ ఆమోదించింది. మొదటిసారి 2017లో చైనా ఆరు ప్రాంతాల పేర్లు మార్చింది. ఆ తర్వాత 2021 డిసెంబర్‌లో మరో 21 ప్రదేశాలకు కొత్త పేర్లు పెట్టింది. ఇక ఈ ఏడాది ఆగస్ట్‌ 18న శాటిలైట్‌ చిత్రాల్లో చైనా ఆగడాలు బయటపడ్డాయి. అక్సాయ్‌చిన్‌(Aksai Chin)లో వేగంగా నిర్మాణాలు చేపట్టింది చైనా. వేగంగా రోడ్లు, శాశ్వత సైనిక గుడారాల నిర్మాణం చేపట్టింది. 250 హెక్టార్ల విస్తీర్ణంలో మౌలిక సదుపాయాలను విస్తరిస్తోంది. భారీ యంత్రాలు, ట్రక్కులతో పనులు జరుగుతున్న చిత్రాలు బయటికొచ్చాయి. వాస్తవాధీన రేఖకు 65కిలోమీటర్ల దూరంలోనే ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. సముద్ర మట్టానికి 5 వేల మీటర్ల ఎత్తులో నిర్మాణాలు చేపట్టింది.

ఒప్పందం ఉల్లంఘిస్తున్న డ్రాగన్ కంట్రీ..

2020 మేలో చైనా, భారత్‌ల మధ్య ఘర్షణలతో రెండు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. తర్వాత నుంచి కార్యకలాపాలను ముమ్మరం చేసింది చైనా. ఐతే వివాదాస్పద ఏరియా నుంచి సైన్యం వెనుదిరగాలని ఒప్పందం కుదిరింది. అయినప్పటికీ వివాదాస్పద ఏరియాలో సైన్యాన్ని మోహరిస్తోంది చైనా. ఒకవైపు చర్చలంటూనే మరోవైపు సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. మరోవైపు ఇటీవల సౌతాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో మోదీ, జిన్‌పింగ్ కలుసుకున్నారు. కొద్దిసేపు చర్చించుకున్నారు. దానిపైనా అసత్య ప్రచారం చేసింది. మోదీ అభ్యర్థన మేరకే జిన్‌పింగ్‌ మోదీతో మాట్లాడారంటూ ప్రకటించింది. దీంతో చైనా ప్రకటనపై తీవ్రంగా స్పందించింది భారత్‌.

అరుణాచల్ ప్రదేశ్‌‌లో కొంత భాగం తమదేనని చైనా వాదిస్తోంది. ఈ పేర్లు మార్చడాన్ని చైనా తన వాదనలకు మరింత బలం చేకూర్చే ప్రయత్నంగా భావిస్తున్నారు. అయితే, అరుణాచల్ ప్రదేశ్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమని కేంద్రం పలుసార్లు స్ఫష్టం చేసింది. కొద్ది రోజుల్లో జీ20 సదస్సు జరగనున్న వేళ, మ్యాపుల వ్యవహారంపై భారత్‌ ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.

ఇది కూడా చదవండి: చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి.. డ్రాగన్‌ తోక వంకరే!

Advertisment
Advertisment
తాజా కథనాలు