కేంద్ర బృదం తనిఖీలు
వరద నష్టాన్ని అంచనా వేయటానికి తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర అధికారుల బృందం పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో తీవ్రస్థాయిలో కురిసిన వర్షాల కారణంగా పెద్ద ఎత్తున ఏర్పడిన వరదల మూలంగా అనేక జిల్లాలో నష్టాన్ని పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ మంత్రిత్వ శాఖల అధికారులతో కూడిన కేంద్ర అధికారుల బృందం తెలంగాణ రాష్ట్రంలో పర్యటించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశించారు. ఈ అధికారుల బృందంలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఆర్థిక శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖ, విద్యుత్ మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, స్పేస్ డిపార్ట్ మెంట్ కు సంబంధించిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధికారులు ఉన్నారు.
నష్టాన్ని అంచనా వేయడం
ఈ అధికారుల బృందానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ సలహాదారుడు కునాల్ సత్యార్థి నాయకత్వం వహిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా సంభవించిన వరద ప్రాంతాల్లో జరిగిన నష్టంపై కేంద్ర అధికారుల బృందం సందర్శించి జరిగిన నష్టాన్ని అంచనా వేయడంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న వివరాలను కూడా జతపరుస్తూ.. కేంద్ర అధికారుల బృందం నివేదిక తయారుచేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుందని కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. వరద బాధితులకు కేంద్రం అండగా నిలుస్తుందని చెప్పారు.
అండగా ఉంటాం
వరంగల్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కిషన్‌రెడ్డి పర్యటించారు. భూపలపల్లి జిల్లా మోరంచపల్లికి చేరుకున్న ఆయన అక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులతో మాట్లాడారు. రంగంపేటకు చేరుకొని వరద బాధితులను పరామర్శించారు.