కుండపోత వర్షాలు
అసోం రాష్ట్రాన్ని వరదలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు పొంగి ప్రవహిస్తుండటంతో అసోం అతలాకుతలం అయింది బ్రహ్మపుత్రతోపాటు పలు నదులు ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. పలు నదుల్లో నీటిమట్టం పెరుగుతుండటంతో వరద నీరు వందలాది గ్రామాలను ముంచెత్తింది. 11 జిల్లాల్లో వరద పీడిత ప్రాంతాల నుంచి 34 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ వరదలపై అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ రోజు వారీగా వరద నివేదికలను విడుదల చేస్తోంది.
ముంపుకు గురైన 77 గ్రామాలు
వరద ప్రభావంతో 14 వేల మహిళలు, 3 వేల చిన్నారులు అల్లాడిపోతున్నారు. దిబ్రూగఢ్, లఖింపూర్, బిశ్వనాథ్, దర్రాంగ్, ధేమాజీ, తముల్‌పూర్, ఉదల్‌గురి జిల్లాల్లో వరద ప్రభావిత జిల్లాలుగా మారాయి.లఖింపూర్‌లో 8, ఉదల్‌గురిలో2 చొప్పున పదకొండు సహాయ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అసోంలో 77 గ్రామాలు వరదల వల్ల ముంపునకు గురయ్యాయి.అస్సాం అంతటా 209.67 హెక్టార్ల పంటలు దెబ్బతిన్నాయని అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ తెలిపింది.లఖింపూర్, ఉదల్‌గురిలో చెరువుల కట్టలు తెగిపోయాయి.మోరిగావ్, నల్బారి, సోనిత్‌పూర్, తముల్‌పూర్, ఉదల్‌గురి, బిస్వనాథ్, బొంగైగావ్, దిబ్రూఘర్, గోలాఘాట్, జోర్హాట్, కర్బీ అంగ్లాంగ్ వెస్ట్, లఖింపూర్ జిల్లాల్లో రోడ్లు భారీ కోతకు గురయ్యాయి.
దెబ్బతిన్న మౌలిక సదుపాయాలు
భారీ వర్షాల కారణంగా దిమా హసావో, కమ్రూప్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడినట్లు అసోం అధికారులు చెప్పారు. లఖింపూర్, నల్బరీ, ఉదల్‌గురి, బక్సా, బిస్వనాథ్, ధేమాజీ, దిబ్రూగఢ్ జిల్లాల్లో వరదల కారణంగా రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు.